బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 02:13:28

హైదరాబాద్‌ హై అలర్ట్‌

హైదరాబాద్‌ హై అలర్ట్‌

  • ముమ్మరంగా పునరావాస, సహాయ చర్యలు
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో 40 క్యాంపుల ఏర్పాటు
  • ప్రాణనష్టాలు నివారించేందుకు అన్ని చర్యలు
  • అన్నపూర్ణ క్యాంటిన్ల ద్వారా భోజనం సరఫరా
  • రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ బృందాలు
  • ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలూ అప్రమత్తంగా ఉన్నాయి
  • సహాయ చర్యలకు అవసరమైతే హెలికాప్టర్లు రెడీ
  • మహిళలకు 50% ‘స్థానిక’ రిజర్వేషన్‌ ఘనత మనదే
  • మండలిలో జీహెచ్‌ఎంసీ సహా నాలుగు బిల్లులు ఆమోదం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో కనీవినీ ఎరుగని రీతిలో వర్షాలు బీభత్సం సృష్టిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్‌ అయినట్టు పురపాలకశాఖమంత్రి కే తారకరామారావు చెప్పారు. మంగళవారంనాటి వర్షాలతో నెలకొన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ఉన్నతాధికారులను అప్రమత్తంచేసి సహాయ, పునరావాసచర్యలను స్వయం గా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రాణనష్టం తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నామన్నారు. విపత్తు నిర్వహణ బృందాలు, జీహెచ్‌ఎంసీ బృందాలు రంగంలోకి దిగాయని, 24గంటలూ విధుల్లో ఉంటున్నాయని చెప్పారు. బుధవారం సమావేశమైన శాసనమండలిలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలు, వరదలు, ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ చట్టంతోపాటు మరో నాలుగు చట్ట సవరణ బిల్లులను మండలి ఆమోదించింది అంతకుముందు మంత్రి కేటీఆర్‌ మాట్లాడు తూ భీకరవర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు సీఎస్‌, డీజీపీ, మున్సిపల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీతో 10-12 సార్లు మాట్లాడారన్నారు. 

40 క్యాంపుల ఏర్పాటు 

వరద నీళ్లు వచ్చిన కాలనీల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌ సభకు వెల్లడించారు. హైదరాబాద్‌లో 40 పునరావాస క్యాంపులను ఏర్పాటుచేసినట్టు ప్రకటించారు. క్యాంపుల్లోని వారికి భోజనాలు, దుప్పట్లు, వైద్యం, మందులు అందజేస్తున్నట్టు తెలిపారు. అన్నపూర్ణ భోజన కేంద్రా ల ద్వారా గతంలో రోజూ 40 వేల భోజనాలు పెడితే దాన్ని ఇప్పుడు నాలుగు రెట్లు పెంచామన్నారు. గురు, శుక్రవారాల్లో కూడా ఈ సౌకర్యం ఉంటుందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు, కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో.. 104 వాహనాలను వైద్యసిబ్బందితోపాటు సిద్ధంచేశామని పేర్కొన్నారు. సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు జోన్లవారీగా ఇంచార్జులుగా ఉండి సహాయచర్యలు చేపడతారని చెప్పారు. మూసీకి వరద వస్తుండటంతో దాని పరీవాహక ప్రాంతం, హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాం తాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

ప్రాణనష్టం జరుగకుండా చర్యలు

విపత్తుల వేళ ఎంతో కొంత ఆస్తినష్టం జరుగుతుందని, కానీ ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకొంటున్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. బుధ, గురువారాల్లో సీఎం ఆదేశాల మేరకు అన్ని సంస్థలకు సెలవులు ప్రకటించినట్టు చెప్పారు. అత్యవసరమైతే తప్ప ఇండ్లనుంచి బయటకు రావొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. శిథిల భవనాల్లో ఉంటున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఏటా శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను గుర్తించి.. అందులో నివసిస్తున్నవారిని ఖాళీచేయాలని నోటీసులిస్తున్నట్టు తెలిపారు. కొందరు స్టే తెచ్చుకోవడంతో ఇబ్బందులు ఏ ర్పడుతున్నాయని చెప్పారు.

50% రిజర్వేషన్లు ఇచ్చిన మొదటి రాష్ట్రం

అసెంబ్లీలో మంగళవారం ఆమోదం పొం దిన జీహెచ్‌ఎంసీ చట్టసవరణ బిల్లును మంత్రి కేటీఆర్‌ బుధవారం శాసనమండలిలో ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ  పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో, జీహెచ్‌ఎంసీలో ఇలా అన్నిచోట్ల మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక, మొట్టమొదటి రా ష్ట్రం తెలంగాణ అన్నారు. తాము గతంలోనే ఈ అంశంపై జీవో ఇచ్చామన్న కాంగ్రెస్‌ ఎమ్మె ల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. ఆలోచనలు తప్ప అమలుచేసే సంస్కృతి కాంగ్రెస్‌ది కాదని ఎద్దేవా చేశారు.  గ్రీన్‌స్పేస్‌కు బడ్జెట్‌లో పదిశాతం కేటాయింపు, ప్రతి డివిజన్‌కు నాలుగు వార్డు కమిటీల ఏర్పాటు, రెండు టర్మ్‌లకు ఒకసారి రిజర్వేషన్ల మార్పిడి వంటి సవరణలను కూడా ప్రతిపాదించారు.  

దుమ్ములో ఉండాలని ఏదేవుడూ కోరడు

అంబర్‌పేటలోని మసీదు విషయంలో నెలకొన్న అంశంపై మంత్రి మాట్లాడుతూ.. రోడ్డు పక్కన దుమ్ములో ఉండాలని ఏ దేవుడూ కోరుకోడని అన్నారు. రోడ్డుపక్కన ఉన్న అన్ని ప్రార్థన మందిరాలను తొలిగించాలని గుజరాత్‌లో మోదీ సీఎంగా ఉండగా చట్టం తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇక్కడ ఎంఐఎం, బీజేపీ సహకరిస్తే తాము కూడా చట్టంతెస్తామన్నారు. అనంతరం జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లును శాసనమండలి ఆమోదించింది.

అపోహలు, అనుమానాలతో ముట్టడికి పిలుపునిచ్చారు

ఎమ్మెల్సీ రాంచంద్రారావు న్యాయవాది కాబట్టి న్యాయంగా మాట్లాడుతారని భావించానని, కానీ ఆయన అలా మాట్లడలేదని కేటీఆర్‌ అన్నారు. వారికి, వారి పార్టీకి అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘మేము ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉన్నవారికి కూడా జీహెచ్‌ఎంసీలో పోటీకి అనుమతిస్తామని వారికి కలబడిందట.. దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.. పైగా దీన్ని విజయవంతమైందని ప్రకటించుకొన్నారు. బిల్లు వచ్చాక, చదువుకొని ముట్టడికి పిలుపునిచ్చుకోవచ్చుకదా’ అని ఎద్దేవాచేశారు. బీసీ రిజర్వేషన్లలో ఎ లాంటి మార్పుచేయలేదని స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఉంటాయని, వాటిని ఎవరూ మార్చలేరన్నారు. వార్డు కమిటీల ఏర్పాటుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వం ఏదీ చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా, బాజాప్తాగా చేస్తుందన్నారు. కార్పొరేటర్లను తక్కువ చేయాలనే ఆలోచన తమకు లేదని చెప్పారు. 

హైదరాబాద్‌కు కేంద్రం అదనంగా చేసిందేమీ లేదు

హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం అదనంగా చేసిందేమీ లేదని, కానీ ఇక్కడి బీజేపీ నేతలు మాత్రం బీరాలు పలుకుతున్నారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. న్యాయబద్ధంగా రావాల్సిన పైసలనే కేంద్రం ఇవ్వడం లేదన్నారు. మిలియన్‌ ప్లస్‌ సిటీస్‌ స్కీం కింద మనకు రూ.1600 కోట్లు రావాలని గుర్తుచేశారు. దీనిపై ఇటీవలే హర్దీప్‌సింగ్‌పురిని కలిసి కూడా విజ్ఞప్తిచేసినట్టు తెలిపారు. ‘ఓవైపు జీఎస్టీ ఎగ్గొడతరు. న్యాయంగా రావాల్సిన పైసలు ఇవ్వరు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మా టల్లో ప్రేమ పొంగుతుంది కానీడబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. నిజంగా మీకు హైదరాబాద్‌పై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రం దగ్గరికి వెళ్లి మనకు రావాల్సిన డబ్బులతో పాటు ప్రత్యేకంగా ప్యాకేజీని ప్రకటించేలా చేయండి’ అని బీజేపీ నేతలకు సవాల్‌ విసిరారు. దేశంలోనే అత్యధిక పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌ ఉన్న మున్సిపాలిటీలు తెలంగాణలోనే అధికమని, వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించడంలో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉన్నదని తెలిపారు. బీజేపీ నేతలు వీధి వ్యాపారులకు లోన్లు ఇప్పించి గ్రాంట్లు ఇప్పించినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవాచేశారు. 

40 ఏండ్లలో ఇంత వర్షాన్ని చూడలేదు

తాను నలభై ఏండ్లుగా హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ ఇంత వర్షాన్ని ఎన్నడూ చూడలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు అన్ని శాఖల అధికారులతో సమావేశమై.. వరద బారినపడ్డ ప్రాంతాల్లో అన్ని సహాయచర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. విపత్తు నిర్వహణ బృందాలను వెంటనే రంగంలోకి దింపామని, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలనూ అప్రమత్తంచేశామని చెప్పారు. విపత్తు నిర్వహణ బృందంలో 700 మంది ఉన్నారని.. వారంతా నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్నారని కేటీఆర్‌ వివరించారు. 


logo