సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 09, 2020 , 01:50:45

జిల్లాలకు 50వేల రెమ్డిస్‌విర్‌

జిల్లాలకు 50వేల రెమ్డిస్‌విర్‌

  • ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా ఖరీదైన మందులు
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో హెటిరో సరఫరా
  • అన్ని జిల్లాలకు పంపిణీచేసిన టీఎస్‌ఎంఐడీసీ
  • మరో 50 వేల ఇంజెక్షన్లు సిద్ధం చేసిన హెటిరో

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా చికిత్సలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా చికిత్స అందించే ప్రభుత్వ దవాఖానలకు చేరుకున్నాయి. మొత్తం 50 వేల కొవిఫర్‌ ఇంజెక్షన్ల సరఫరాను టీఎస్‌ఎంంఐడీసీ- తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ శనివారం నాటికి పూర్తిచేసింది. దీంతో అవసరమైనవారికి ఉచితంగా మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు మార్గం సుగమమైంది. సీఎం కేసీఆర్‌ చొరవతో  పెద్దమొత్తంలో ఇంజెక్షన్లను అందించిన హెటిరో డ్రగ్స్‌ సంస్థ, అవసరమైతే మరో 50 వేల ఇంజెక్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లుచేసింది.

హెటిరో చైర్మన్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్‌

కరోనాకు ప్రత్యేకంగా ఔషధాలు లేకపోవడంతో అందుబాటులో ఉన్న యాంటీ వైరల్‌ మందులను వినియోగిస్తున్నారు. ఇందులో రెమ్‌డెసివిర్‌ ముఖ్యమైనది. అత్యవసర సమయాల్లో దీనిని వినియోగించడం వల్ల రోగులు కోలుకుంటున్నట్టు తెలుస్తున్నది.  వివిధ రాష్ర్టాల నుంచి ఆర్డర్లు పెరుగడంతో కొరత ఏర్పడుతున్నది. ఈ క్రమంలో బుధవారం జరిగిన క్యాబినెట్‌ భేటీలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. జిల్లాస్థాయిలోనే కరోనా చికిత్స అందించాలని సీఎం కేసీఆర్‌ సూచించిన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అధికారులు రెమ్‌డెసివిర్‌ అవసరాన్ని వివరించారు. దీంతోజిల్లాస్థాయిలో కరోనా చికిత్స అందించే ప్రభుత్వ దవాఖానల్లో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉండాల్సిందేనని ఆదేశించారు. వెంటనే కొవిఫర్‌ పేరుతో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు ఉత్పత్తిచేస్తున్న హెటిరో డ్రగ్స్‌ చైర్మన్‌ పార్థసారథిరెడ్డితో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. రాష్ట్ర అవసరాల కోసం రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు సరఫరాచేయాలని కోరారు.దీనికి పార్థసారథిరెడ్డి అంగీకరించడంతో  టీఎస్‌ఎంఐడీసీ ఆర్డర్‌ ఇవ్వడం, హెటిరో 50 వేల ఇంజెక్షన్లు అందించడం, వాటిని అన్ని జిల్లాలకు సరఫరాచేయడం కేవలం మూడు రోజుల్లో జరిగిపోయింది. ప్రైవేటులో అందించే విలువైన మందులు ప్రభుత్వ దవాఖానలకు అందుబాటులోకి వచ్చాయని టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు.

5 లక్షల ఫావిఫిరావిర్‌, లక్ష ఐసొలేషన్‌ కిట్లు 

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ప్రైవేటును మించిన వైద్యం అందుబాటులో ఉండాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ విలువైన, ముఖ్యమైన మందులను కొనుగోలుచేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ముఖ్యమైన మందులను జిల్లాలకు పంపిణీచేసిన టీఎస్‌ఎంఐడీసీ శనివారం నాటికి 5 లక్షల ఫావిఫిరావిర్‌ ట్యాబ్లెట్ల సరఫరాను పూర్తిచేసింది. మరో లక్ష హోం ఐసొలేషన్‌ కిట్లను జిల్లాలకు చేరవేసింది. 
logo