శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 20:55:38

'కాకతీయ తెలంగాణ', 'జనగణమన తెలంగాణ' పుస్తకాలు ఆవిష్కరణ

'కాకతీయ తెలంగాణ', 'జనగణమన తెలంగాణ' పుస్తకాలు ఆవిష్కరణ

హైదరాబాద్‌ : కాకతీయ తెలంగాణ, జనగణమన తెలంగాణ పుస్తకాలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ శనివారం ఆవిష్కరించారు. కాకతీయ ట్రస్టీ ఆధ్వర్యంలో ప్రొ. పాండు రంగారావు ఎడిటర్‌గా కాకతీయ తెలంగాణ అదేవిధంగా శ్యాం మోహన్‌ రచించిన జనగణమన తెలంగాణ పుస్తకాలను  నగరంలోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో వినోద్‌కుమార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాతే చారిత్రక కట్టడాల పరిరక్షణకు కృషి జరుగుతోందన్నారు. కాకతీయ చారిత్రక కట్టడాలతో పాటు ఇతర చారిత్రక నేపథ్యం ఉన్న కట్టడాల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అన్నారు.

రామప్ప కట్టడాలకు యునెస్కో గుర్తింపు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కరీంనగర్‌ జిల్లాలోని నంగునూరు, కొత్తపల్లిలోని కాకతీయుల నాటి పురాతన దేవాలయాల పునరుద్ధఱన కోసం కృషి జరుగుతున్నట్లు తెలిపారు. రాణి రుద్రమదేవి స్ఫూర్తితో తెలంగాణ ప్రాంతం మహిళా చైతన్యానికి కేంద్ర బిందువుగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఆర్‌డీ డైరక్టర్‌ జనరల్‌ బి.పి. ఆచార్య, కాకతీయ హెరిటేడ్‌ ట్రస్టీలు పాపారావు, ప్రొ. పాండురంగారావు, గోపాలకృష్ణ, ఇంటాక్‌ అధ్యక్షులు అనురాధ, గౌతమ్‌ షింగ్లే తదితరులు పాల్గొన్నారు. 


logo