e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home తెలంగాణ పెండ్లి.. చావు.. వైరస్‌

పెండ్లి.. చావు.. వైరస్‌

పెండ్లి.. చావు.. వైరస్‌
 • విషాదానికి వేదికలుగా వేడుకలు
 • విందుల్లో పిలవని చుట్టంగా కొవిడ్‌
 • భారీగా విస్తరిస్తున్న కరోనా కేసులు
 • కొన్నిసార్లు వధూవరులు సైతం బాధితులే
 • అంత్యక్రియలకు హాజరైనవారికీ కరోనా
 • కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడమే కారణం

బీహార్‌లోని ముంగేర్‌లో ఓ వివాహ వేడుక విషాదంగా మారింది.ఈ నెల 8న కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓ జంట పెండ్లి చేసుకొన్నది. పెండ్లయిన ఆరు గంటల్లోనే వధువు అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను తారాపూర్‌లోని కమ్యూనిటీ సెంటర్‌లో చేర్పించగా కరోనా చికిత్స పొందుతూ మృతి చెందింది

సురేందర్‌ ఈ నెల 6న పెండ్లి చేసుకున్నాడు. కరోనా ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని కొంతమందినే ఆహ్వానించాడు. పెండ్లినాడే ఆయనకు జ్వరం వచ్చింది. డోలో 650 వేసుకొని వధువు మెడలో తాళి కట్టాడు. రెండు రోజులకు జ్వరం మళ్లీ తిరగబెట్టింది. ఒళ్లునొప్పులు, కండ్ల మంటలు తోడయ్యాయి. వెంటనే పోయి టెస్ట్‌ చేయించుకోగా కరోనా అని తేలింది. ఈ సంగతి తెలిసి పెండ్లికొచ్చిన బంధువులు, స్నేహితుల్లో కూడా కొందరు వెళ్లి టెస్ట్‌ చేయించుకుంటే 9 మందికి పాజిటివ్‌ వచ్చింది.

రమేశ్‌ వాళ్ల అన్నయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. రమేశ్‌తోపాటు కుటుంబసభ్యుల్లో చాలామంది అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నాలుగు రోజుల తరువాత రమేశ్‌కు జ్వరం రావడంతోపాటు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. కుటుంబమంతా టెస్ట్‌ చేయించుకోగా రమేశ్‌కు, ఆయన ఇద్దరు కుమారులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ముగ్గురూ ఓ ప్రైవేటు దవాఖానలో చేరితే రూ.22 లక్షలు ఖర్చయ్యింది. ఇంతచేసినా రమేశ్‌ ప్రాణాలు దక్కలేదు.

హైదరాబాద్‌, మే 15 (నమస్తే తెలంగాణ): విందుల్లో కరోనా చిందులు వేస్తున్నది. పిలవని చుట్టమై అందరనీ చుట్టుకుపోతున్నది. ప్రభోజనాలకు వెళ్లిన వారిని కరోనా అలుముకుంటున్నది. వివాహ వేడుకలకు హాజరైన బంధువులను, తంతు జరిపించిన వారిని ఆవహిస్తూ పెళ్లింట విషాదం నింపుతున్నది. అదే విధంగా ఆత్మీయులను కడచూపు చూసేందుకు వెళ్లినవారిని సైతం ఆవహిస్తున్నది. వీటన్నింటికి కారణం కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడమేనని తెలుస్తున్నది. ఒకరి నిర్లక్ష్యం, అత్యుత్సాహమే చివరకు అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది.

వేడుకలే కరోనా వేదికలుగా..

వేడుకల నిర్వహణ ప్రాంగణాలే ప్రస్తుతం కరోనాకు వేదికలుగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక మంది అలా శుభాశుభ కార్యక్రమాలకు వెళ్లి వచ్చి కరోనా బారిన పడిన సంఘటనలు కోకొల్లలుగా నమోదవుతున్నాయి. కరోనా నేపథ్యంలో వివాహాది శుభకార్యాలను వాయిదా వేసుకోవాలని, ఒకవేళ తప్పనిసరి అయితే ముందస్తు అనుమతితో, అదీ కేవలం 40 మంది మించకుండా పెండ్లి తంతును ముగించుకోవాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

మొహమాటానికి పోవొద్దు

ఎవరినీ పిలవకుండా పెండ్లి చేసుకోవడమెలా అని కొందరు.. పిలిచారు కదా వెళ్లకపోతే ఏమనుకుంటారోనని మరికొందరు.. ఇలా ఎవరికి వారు మొహమాటానికి పోయి వేడుకల్లో పాల్గొంటున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎంత జాగ్రత్తపడినా ఫొటో దిగేటప్పుడో, భోజనం చేసేటప్పుడో, దావత్‌లో కూర్చున్నప్పుడో మాస్క్‌ తీయక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. వధూవరులకు శుభాకాంక్షలు తెలిపేందుకు వారికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చిన తరువాత చేతులు శానిటైజ్‌ చేసుకోవడం మరిచిపోయేవారు చాలామంది. ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లే వైరస్‌ సంక్రమణకు కారణాలవుతున్నాయి. చనిపోయినవారిని కడచూపు చూసేందుకు వెళ్లినప్పుడు కూడా ఇలాగే ఎక్కడో ఓ చోట వైరస్‌ అంటుకుంటున్నది. ఇలాంటి సామూహిక కార్యక్రమాల ద్వారానే పదుల సంఖ్యలో కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.

అంత్యక్రియల వద్దా అదే అజాగ్రత్త

ప్రతి మతంలోనూ చావుకు అనేక బాష్యాలున్నాయి. ఒక్కో మతం వారు ఒక్కో విధంగా అంత్యక్రియలను నిర్వహిస్తుంటారు. కరోనా నేపథ్యంలో చాలామంది అంత్యక్రియలకు దూరంగా ఉంటున్నా కొందరు మాత్రం వార్త తెలియగానే పరుగులు తీస్తున్నారు. అక్కడ కూడా కొవిడ్‌ నిబంధనలను పాటించకపోవడం వల్ల వారు కరోనా బారిన పడుతుండటమేగాక, తమ కుటుంబాలను సైతం ప్రమాదంలోకి నెడుతున్నారు. ఆలింగనం చేసుకొని ఏడ్వటం.. మత ఆచారాలను మాస్క్‌లు, గ్లౌజ్‌లు, పీపీఈ కిట్లు ధరించకుండానే నిర్వహిస్తూ వైరస్‌ను తెచ్చుకుంటున్నారు.

వైరస్‌ సోకేందుకు ప్రధానకారణాలివే..

 • సామూహిక వేడుకల వద్ద ఫ్యాన్లు ఉన్నా రద్దీ కారణంగా ఆ పరిసరాలు వేడిగానే ఉంటాయి. సంబురాల్లో మునిగిపోయి ఒకరినొకరు తాకుతుండడం మూలంగా చెమట ద్వారా వైరస్‌ త్వరగా వ్యాప్తి చెందుతున్నది.
 • వేడుకల్లో ఒకరు కూర్చున్న చోట మరొకరు శానిటైజ్‌ చేసుకోకుండానే కూర్చోవడం, వస్తువులను ముట్టుకోవడం, కామన్‌ టాయిలెట్లను వినియోగించడం వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నది.
 • వేడుకల్లో మొహమాటాలకు పోయి మాస్క్‌ ధరించకపోవడం, ఆలింగనం చేసుకోవడం, కరచాలనం చేయడం పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

 • వెళ్లక తప్పదు అనుకుంటేనే వేడుకలకు వెళ్లాలి.
 • కొవిడ్‌ నిబంధనలను తప్పకుండా పాటించాలి.
 • మాస్క్‌ సరిగ్గా ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్క్‌ తీయవద్దు.
 • శానిటైజర్‌ను వెంట తీసుకెళ్లాలి. శానిటైజ్‌ చేయనిదే ఏ వస్తువునూ ముట్టుకోకూడదు. కుర్చీల్లో కూర్చోకూడదు.
 • రద్దీ ఉన్న చోటుకు వీలైనంత దూరంగా, ఇతరుల నుంచి విడిగా ఉండాలి.
 • అంత్యక్రియలకు వెళ్లినా దూరం నుంచే చూసి రావాలి.
 • మతక్రతువులను నిర్వహించేవేళ తప్పకుండా పీపీఈ కిట్‌ ధరించాలి.
 • స్నానం చేయనిదే ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంట్లో అడుగుపెట్టకూడదు.
 • వేడుకలకు హాజరైన వారు కనీసం రెండు మూడు రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండటం ఇంకా మంచిది.

అవకాశం ఉంటే వాయిదానే మంచిది

మే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. నేను నాలుగు వివాహాలు ఒప్పుకున్నా. అందులో ఇద్దరు వేరే ముహూర్తాలకు వాయిదా వేసుకున్నారు. మిగిలిన వారికి వాయిదా వేసుకోవడం కుదరడం లేదు. తక్కువ మందినే పిలుస్తాం. మీరే మా వివాహం జరిపించాలని కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ మందితో పెళ్లి చేసుకోవడమే మేలు. అవకాశం ఉంటే మరో ముహుర్తానికి వివాహాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది.
-కార్తీక్‌, పురోహితుడు

వేడుకలకు దూరంగా ఉండాలి

ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమైనంత మేరకు వేడుకులకు దూరంగా ఉండటం మంచిది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజ్‌ చేసుకోవడం మరచిపోవద్దు. ఆ వేడుకలో మనం కలిసిన వారిలో ఎవరికైనా పాజిటివ్‌ అని తేలితే వెంటనే హోం ఐసొలేషన్‌ అయిపోవాలి. లక్షణాలు ఏమైనా ఉంటే టెస్ట్‌ చేయించుకోవాలి.
-అన్వేష్‌, నిమ్స్‌ వైద్యుడు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పెండ్లి.. చావు.. వైరస్‌

ట్రెండింగ్‌

Advertisement