శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 18:04:14

హేమంత్ హ‌త్య కేసు.. కిడ్నాప్ టూ మ‌ర్డ‌ర్‌

హేమంత్ హ‌త్య కేసు.. కిడ్నాప్ టూ మ‌ర్డ‌ర్‌

హేమంత్ హ‌త్య కేసు.. కిడ్నాప్ టూ మ‌ర్డ‌ర్‌

హైద‌రాబాద్ : రాష్ర్ట వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన హేమంత్ హ‌త్య కేసు వివ‌రాల‌ను మాదాపూర్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు మీడియాకు వెల్ల‌డించారు. నిన్న మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు గ‌చ్చిబౌలి ఎన్జీవో కాల‌నీలో హేమంత్‌ను, అవంతిక‌ను బ‌ల‌వంతంగా యుగంధ‌ర్ రెడ్డి(అవంతిక మేన‌మామ‌) ఎక్కించారు. సాయంత్రం 4:30 గంట‌ల‌కు గోప‌న్‌ప‌ల్లి ద‌గ్గ‌ర హేమంత్‌ను మ‌రో కారులో ఇద్ద‌రు కిరాయి వ్య‌క్తుల‌తో ఎక్కించారు. అక్క‌డే అవంతిక‌ను వ‌దిలేశారు. అదే స‌మ‌యంలో అవంతిక 100కు డ‌య‌ల్ చేయ‌డంతో స్పాట్‌కు పోలీసులు చేరుకున్నారు. హేమంత్‌ను యుగంధ‌ర్ రెడ్డి కారులో కిరాయి హంత‌కుల‌తో ఓఆర్ఆర్ మీదుగా సంగారెడ్డికి వైపు తీసుకెళ్లారు. 

జ‌హీరాబాద్‌లో మ‌ద్యం, తాడు కొనుగోలు చేశారు. హేమంత్ చేతులు, కాళ్లు క‌ట్టేసి కారులో చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారు. మెడ‌కు తాడు బిగించి కారులోనే హ‌త్య చేశారు. రాత్రి 7:30 గంట‌ల‌కు సంగారెడ్డి జిల్లాలోని కిష్ట‌య్య‌గూడెంలో హేమంత్ మృత‌దేహాన్ని పడేశారు. అనంత‌రం ప‌టాన్‌చెరులో మ‌రో ఇద్ద‌రితో క‌లిసి మ‌ద్యం తాగారు. అక్క‌డ్నుంచి సంతోష్ రెడ్డి అనే వ్య‌క్తికి యుగంధ‌ర్ రెడ్డి ఫోన్ చేశాడు. అప్ప‌టికే పోలీసుల అదుపులో సంతోష్ రెడ్డి ఉన్నాడు. ఫోన్ సిగ్న‌ల్స్ ఆధారంగా యుగంధ‌ర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌ని డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు వెల్ల‌డించారు. హేమంత్‌ను చంపేందుకు మొత్తం రూ. 10 ల‌క్ష‌ల‌కు కిరాయి హంత‌కుల‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు యుగంధ‌ర్ రెడ్డి. ఈ హ‌త్య కేసులో యుగంధ‌ర్ రెడ్డితో పాటు 12 మందిని అరెస్టు చేశారు.