శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 01:24:35

బయటకొస్తే కేసు బుక్కే!

బయటకొస్తే కేసు బుక్కే!

-అత్యవసరమైతేనే గడప దాటాలని పోలీసుల సూచన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా అనవసరంగా ఇండ్లనుంచి బయటకొచ్చేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఐపీసీలోని 188, 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదుచేస్తున్నారు. దీంతో నిందితులకు రెండేండ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్‌లో భారీగా వాహనాల సీజ్‌

లాక్‌డౌన్‌ ఉన్నా అనవసరంగా ఇండ్లనుంచి బయటకొస్తున్నవారిపై హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. మంగళవారం రాచకొండ పరిధిలో 150 మందిపై కేసులు నమోదుచేయడంతోపాటు 244 వాహనాలను సీజ్‌చేశారు. సైబరాబాద్‌ పరిధిలో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా 350కిపైగా ట్రాఫిక్‌ చలాన్లు జారీచేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు 700 వాహనాలను సీజ్‌ చేశారు.

లాక్‌డౌన్‌ కట్టుదిట్టం

లాక్‌డౌన్‌ను అమలుచేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన పోలీసులు.. ఎక్కడికక్కడ రోడ్లపై బారికేడ్లు ఏర్పాటుచేసి పహారా కాస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి కర్ఫ్యూ ఉన్నందున ఎవరూ ఇండ్లనుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చేవారికి నమస్కరించి మరీ లోపలికి వెళ్లాలని విజ్ఞప్తిచేస్తున్నారు. వినకపోతే లాఠీలకు పనిచెప్తున్నారు. వైద్య సిబ్బంది, మీడియాపై కొన్నిచోట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించిన అంశాలు దృష్టికి రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. వారిని నిలుపుదల చేయకుండా సిబ్బందికి తగిన ఆదేశాలిచ్చారు. 

సిబ్బందికి అలసట లేకుండా చర్యలు

అత్యవసర పరిస్థితిలో పోలీస్‌ సిబ్బంది 24 గంటలపాటు పనిచేయాల్సి వస్తుండటంతో వారు అలిసిపోకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉన్న సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని పని గంటలను విభజించుకుంటున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను అందరూ కచ్చితంగా పాటించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి కోరారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని, లేదంటే ఇబ్బందులు తప్పవని హితవు పలికారు.


logo