సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 21, 2021 , 01:57:05

మంచు కురిసే.. పర్యాటకులు మురిసె

మంచు కురిసే.. పర్యాటకులు మురిసె

  • చలికాలంలో టూరిస్టుల సందడి
  • ప్రత్యేక ఆకర్షణగా పర్యాటక ప్రాంతాలు

హైదరాబాద్‌, జనవరి 20 (నమస్తే తెలంగాణ): వణికించే చలి.. పక్కనే ఉన్నా కనిపించనంతగా కురిసే పొగమంచు.. అప్పుడే పడుతున్న సూర్యకిరణాల మధ్య పర్యాటక అందాలు వీక్షిస్తే ఆ అనుభూతే వేరు. ఊహించుకోడానికే ఎంతో అద్భుతంగా ఉన్నది. అందుకే అలాంటి సమయంలో రాష్ట్రంలోని ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు ఆసిక్తి కనబరుస్తున్నారు. ఏటా చలికాలంలో పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అందుకే నవంబర్‌, డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి నెలలు పర్యాటకశాఖకు చాలా కీలకం. విదేశీయులు సైతం ఈ సమయంలో ఎక్కువగా వస్తుంటారు. రాష్ర్టానికి వచ్చే మొత్తం విదేశీ పర్యటకుల్లో సగం వాటా ఈ నాలుగు నెలలదే. అందుకే ఏటా ఈ సమయానికి సందర్శకుల కోసం పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటుంది. కరోనా ఉన్నప్పటికీ ప్రస్తుతం పర్యాటకుల తాకిడి మాత్రం తగ్గలేదు. నవంబర్‌లో మొదలైన పర్యాటకుల రాక క్రమక్రమంగా పెరుగుతున్నదని పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. 

చారిత్రక కట్టడాలకు ప్రాధాన్యం

చలికాలంలో చారిత్రక కట్టడాలను చూసేందుకు పర్యాటకులు ఇష్టపడుతున్నారు. హైదరాబాద్‌లో చార్మినార్‌, గోల్కొండ కోట, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో చారిత్రాక ఆలయాల్లో సందడి పెరిగింది. వీటితోపాటు కొండ, గుట్ట ప్రాంతాలను సందర్శించేవారు ఎక్కువగా ఉంటున్నారని పర్యాటకశాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. మెదక్‌లోని కెథడ్రల్‌ చర్చి, సంగారెడ్డిలోని పురాతన జైల్‌ మ్యూజియం, యాదాద్రి జిల్లాలో భువనగిరి ఖిల్లా, యాదాద్రి ఆలయం, నిజామాబాద్‌ జిల్లాలోని కంఠేశ్వర్‌ ఆలయం, ఖమ్మంలోని స్తంభాద్రిహిల్స్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని టిప్పు సుల్తాన్‌ చౌక్‌, నల్లగొండ జిల్లాలో బుద్ధవనం, ఇతర ప్రముఖ ఆలయాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

VIDEOS

logo