మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 15:59:15

రాబోయే 72 గంట‌ల్లో హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం!

రాబోయే 72 గంట‌ల్లో హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం!

హైద‌రాబాద్ : రాబోయే 72 గంట‌ల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించిన నేప‌థ్యంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అప్ర‌మ‌త్త‌మైంది. రాబోయే 72 గంట‌ల పాటు అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్ కుమార్ ఆదేశించారు. న‌గ‌రంలోని కొన్ని ప్రాంతాల్లో 9 నుంచి 16 సెంటిమీట‌ర్ల వ‌ర్షపాతం కురిసే అవ‌కాశం ఉన్నందున ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.  

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో హైద‌రాబాద్ ప‌రిధిలో శిథిలావస్థ‌లో ఉన్న భ‌వ‌నాల‌ను గుర్తించాల‌ని జీహెచ్ఎంసీ అధికారుల‌ను పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పాత భ‌వ‌నాల య‌జ‌మానుల‌కు నోటీసులు జారీ చేయాల‌ని, ఆ భ‌వ‌నాల్లో నివ‌సిస్తున్న వారిని త‌క్ష‌ణ‌మే ఖాళీ చేయించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ న‌ష్టాన్ని నివారించేందుకే ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పాత భ‌వ‌నాల య‌జ‌మానుల‌కు తెలియ‌జేయాల‌ని అధికారుల‌కు కేటీఆర్ సూచించారు. ఎడతెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నందున అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అసిస్టెంట్ సిటీ ప్లాన‌ర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందిని కేటీఆర్ ఆదేశించారు. 

పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నంకు ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్లు, నర్సాపూర్‌కు తూర్పు ఆగ్నేయ దిశగా 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. వాయుగుండం రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉందని చెప్పింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి నర్సాపూర్‌, విశాఖపట్నం మధ్య కాకినాడకు మధ్యలో మంగళవారం తెల్లవారు జామున తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో గాలుల తీవ్రత గంటకు 50 నుంచి 75కిలోమీటర్ల వేగంతో ఉండవచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. మెదక్‌, సిద్దిపేట, గద్వాల జోగులాంబ, వనపర్తి, వికారాబాద్‌, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్‌ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్‌ అర్బల్‌, రూరల్‌, కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. 


logo