మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 14, 2020 , 01:53:00

రాష్ట్రంపై ముసురు

రాష్ట్రంపై ముసురు

  • పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు 
  • పొంగుతున్న వాగులు, వంకలు.. మత్తడి దుంకుతున్న చెరువులు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు అలుగు పోస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖమ్మంలోని మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. జనగామ మినహా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వర్షం దంచికొట్టింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని పెద్దవాగు, చెలిమెల, సింగంపల్లి, మోరంచ వాగులు పొంగిపొర్లుతున్నాయి. గణపురం మండలంలో ఆర్టీసీ బస్సుపై చెట్టు కూలడంతో కండక్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. 

భూపాలపల్లి సింగరేణి ఏరియాలో సంస్థకు రూ.4.12 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ములుగు జిల్లాలో జంపన్నవాగు ఉద్ధృతి పెరిగింది. కరీంనగర్‌ జిల్లాలో  228 మత్తళ్లు దుంకుతున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని కూడెల్లి, కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగులు పొంగిపొర్లుతున్నాయి.  గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంపై ముసురు ముసుగేసింది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిశాయి.


logo