సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 02:15:10

2 గంటలు.. 11 సెంటీమీటర్లు

2 గంటలు.. 11 సెంటీమీటర్లు

  • హైదరాబాద్‌ను ముంచెత్తిన జడివాన
  • ఉరుములు, మెరుపులతో హోరెత్తిన మహానగరం
  • పలుచోట్ల వరదల ధాటికి కొట్టుకుపోయిన వాహనాలు
  • ముమ్మరంగా కొనసాగిన సహాయక చర్యలు
  • మరో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

అప్పటిదాకా భగభగమండే ఎండ.. వాన ఆనవాళ్లే లేవు.. కానీ, సాయంత్రం 4 గంటలు కాగానే ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకున్నాయి.. అంతటా చీకటి అలుముకుంది. వర్షం పడుతుందేమో! అనుకునేలోపే.. నీళ్లన్నింటినీ ఒకేసారి కుమ్మరించినట్టు వరుణుడు భాగ్యనగరాన్ని ముంచెత్తాడు. మొగులుకు చిల్లు పడిందేమో అన్నట్టు జడివాన కురిసింది. కేవలం 2 గంటల్లోనే 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటేనే ఏ రేంజ్‌లో వానపడిందో అర్థం చేసుకోవచ్చు. బుధవారం ఉరుములు, మెరుపులతో, గాలి తోడుగా వర్షం బీభత్సం సృష్టించింది.  లోతట్టు ప్రాంతాలను నీళ్లతో నింపేసి, రహదారులను ముంచేసి నగరవాసులను బెంబేలెత్తించింది. వరద ధాటికి హకీంపేట్‌, టోలిచౌకీ తదితర ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. రాజధానిలో ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు నీళ్లు నిండాయి. వాన ప్రభావానికి కొన్ని చోట్ల రోడ్డు కుంగిపోయింది. మరో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


సిటీబ్యూరో-నమస్తే తెలంగాణ: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు ఈస్ట్‌, వెస్ట్‌ షియర్‌జోన్‌, ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో బుధవారం మూడుగంటలపాటు కుండపోత వాన కురిసింది. ఉరుములు, మెరుపులతో పెద్ద ఎత్తున కురిసిన గాలివాన వల్ల నగరంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. పళ్లపు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులపై వరద నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ చెరువలను తలపించాయి. గ్రేటర్‌లోని పాతబస్తీ బహదుర్‌పురా, చందూలాల్‌బరాదరిలో అత్యధికంగా 11సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా పటాన్‌చెరు, మహేశ్వరంలో అత్యల్పంగా 1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్‌ అధికారులు వెల్లడించారు. ఈ నెల 20న మరో అల్పపీడనం ఏర్పడనుండడంతో రాగల ఐదు రోజులు గ్రేటర్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీచేశారు.  logo