మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 01:18:48

వాయుగండం

వాయుగండం

  • బంగాళాఖాతంలో రూపుమారిన అల్పపీడనం
  • 18 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు
  • నేటి ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మార్పు
  • రాత్రికి ఏపీలో నర్సాపూర్‌, విశాఖ మధ్య తీరానికి
  • రెండ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు 
  • హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక

భారీవర్ష సూచన ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల అధికారులు మరింత అప్రమత్తం కావాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచాలి. వంతెనలపైనుంచి వరదనీరు ప్రవహించే అవకాశం ఉన్నందున ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా దృష్టిపెట్టాలి. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలి.

-అధికారులకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం ఉదయం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి సోమవారానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్‌, విశాఖపట్నం మధ్య సోమవారం రాత్రి తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక, పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది.

 వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రధానంగా ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతోపాటు గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఒకటి రెండుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. 

పలు జిల్లాల్లో దంచికొట్టిన వాన

ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగలమడ్క, సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షిపూర్‌లో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసినట్టు తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ తెలిపింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పలుచోట్ల ఉదయం నుంచే మబ్బులు పట్టి ఉండగా మధ్యాహ్నం నుంచి వర్షం కురిసింది. ఇప్పటికే కోతలు ప్రారంభించిన పలు ప్రాంతాల్లో ధాన్యం తడిసింది. లింగంపేట, రామారెడ్డి, గాంధారి మండలాల్లో చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. గాంధారి మండల కేంద్రంలో పిడుగుపాటుకు ఎద్దు మృత్యువాత పడింది. 

నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట, బిజినేపల్లి, తాడూరు, కొల్లాపూర్‌ మండలాల్లో భారీ వర్షం కురిసింది. పత్తి, వరిపైరు నీటమునిగాయి. కొల్లాపూర్‌ మండలంలో 22.06 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, ముక్కిడిగుండం జల దిగ్బంధం అయింది. ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా ఆదివారం ఉద యం10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. వరిపంటలు నేలకొరిగాయి. పత్తి పంట పొలాల్లో నీరు నిలువడంతోపాటు ఏరడానికి సిద్ధంగా ఉన్న పత్తి పూర్తి తడిసిపోయింది. మెదక్‌ జిల్లా రామాయంపేటలో వర్షం నీరు ఇంట్లోకి చేరి ఓ మహిళ విద్యుత్‌ షాకు గురై గాయాలపాలైంది. 

సిద్దిపేట జిల్లాలో రహదారులపై వర్షం నీరు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే పలుమార్లు మత్తడి దుంకిన చెరువులు, కుంటలు, వాగులు, చెక్‌డ్యాంలు మరోమారు మత్తడి దుంకుతున్నాయి. కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో భారీ వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మద్దూరు మండలం కమలాయపల్లి చెరువులోకి వచ్చే తపాసుపల్లి కాల్వ తెగడంతో  నీరంతా పంట చేలల్లోకి చేరుకున్నది. నిర్మల్‌ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆయాచోట్ల కోసి, ఆరబెట్టిన సోయా తదితర పంటలు వర్షానికి తడిసిపోయాయి. దీంతో రైతులు పంటలపై టార్పాలిన్లు కప్పి తడిసిపోకుండా జాగ్రత్త పడ్డారు.


చర్లగూడ వాగులో యువకుడు గల్లంతు

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలోని చర్లగూడకు చెందిన వెంకటేశ్‌ (32) గ్రామానికి వెళ్లేందుకు  చర్లగూడవాగు దాటుతుండగా అదుపుతప్పి కొట్టుకుపోయాడు. పోలీసులు, కుటుంబీకులు, గ్రామస్థులు గాలించినా రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. గల్లంతైన యువకుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.


logo