హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపై వరద నీరు ఏరులై పారుతుంది. ఆఫీసు వేళలు ముగిసి ఇంటికి చేరుకునే సమయం కావడంతో రహదారులపై ట్రాఫిక్ భారీగా ఏర్పడింది. ట్రాఫిక్ జాంతో పలుచోట్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారం రెండు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల వద్ద ఉపరితలద్రోణి ఆవరించి ఉంది. అదేవిధంగా ఉత్తర ఒడిశా నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.