బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 16:39:20

భాగ్య‌న‌గరా‌న్ని ముంచెత్తుతున్న భారీ వ‌ర్షం

భాగ్య‌న‌గరా‌న్ని ముంచెత్తుతున్న భారీ వ‌ర్షం

హైద‌రాబాద్ : నిన్న‌టి నుంచి కురుస్తున్న భారీ వ‌ర్షాలు భాగ్య‌న‌గరాన్ని ముంచెత్తుతున్నాయి. కుండ‌పోత వాన‌ల‌కు హైద‌రాబాద్ న‌గ‌రం విల‌విల‌లాడిపోతోంది. గ‌త 3 గంట‌ల నుంచి జంట న‌గ‌రాల్లో నాన్‌స్టాప్‌గా వ‌ర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ప్ర‌ధాన ర‌హ‌దారుల‌పై వ‌ర్ష‌పు నీరు నిలిచిపోవ‌డంతో ప్ర‌యాణికులు, వాహ‌న‌దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల‌కొరిగాయి. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు వ‌స్తున్న ఫిర్యాదుల‌ను స్వీక‌రించి.. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. 

మ‌రో రెండు రోజుల పాటు వాన‌లు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. పిల్ల‌లు, వృద్ధులు బ‌య‌ట‌కు రావొద్ద‌ని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. శిథిలావ‌స్థ భ‌వ‌నాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించాల‌ని అధికారుల‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఆదేశించారు. 

మూసీ న‌ది పొంగిపొర్లుతోంది. చాద‌ర్‌ఘాట్‌, ముసారాంబాగ్ బ్రిడ్జిల వ‌ద్ద పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి స‌మీపంలో ఉన్న హిమాయ‌త్‌సాగ‌ర్‌కు వ‌ర‌ద పోటెత్తింది. శివార్ల‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో హిమాయ‌త్‌సాగ‌ర్‌కు వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. హిమాయత్‌సాగ‌ర్‌లో క్ర‌మ‌క్ర‌మంగా నీటిమ‌ట్టం పెరుగుతోంది. ఆ జ‌లాశ‌యం ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 1762.176 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటిమ‌ట్టం 1763.50 అడుగులు. 833 క్యూసెక్కుల నీరు హిమాయ‌త్‌సాగ‌ర్‌కు వ‌చ్చి చేరుతున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. 


logo