సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 02:15:13

చిల్లుపడ్డ ఆకాశం

చిల్లుపడ్డ ఆకాశం

  • దక్షిణ తెలంగాణలో కుండపోత
  •  హైదరాబాద్‌ను ముంచెత్తిన జడివాన.. 2 గంటలు 11 సెంటీమీటర్లు
  • ఉరుములు.. మెరుపులతో హోరెత్తిన నగరం
  • పలుచోట్ల కొట్టుకుపోయిన వాహనాలు..ముమ్మరంగా సహాయక చర్యలు
  • మరో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • పాలమూరు వాగులో చిక్కుకున్న దంపతులు 

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: హైదారాబాద్‌సహా దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం కుండపోత వాన కురిసింది. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి దంచికొట్టింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండు గంటలపాటు11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో నగరం హోరెత్తిపోగా.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. టోలీచౌకీ, పాతబస్తీ బహదుర్‌పురా, చందూలాల్‌బరాదరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఉమ్మడి పాలమూరు, వికారాబాద్‌, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వాన కురిసింది. వరదతో వాగులు ఉప్పొంగి ప్రవహించగా, చెరువులు అలుగులు పారుతున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని ‘డిండి’ వాగులో గిరిజన దంపతులు చిక్కుకున్నారు. వికారాబాద్‌ జిల్లాలోని కారిగుళ్ల వాగులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిక్కుకొన్నారు. వీరిలో ఆరుగురు ప్రాణాలతో బయటపడగా.. ఓ మహిళ మృత్యువాత పడింది. వరద కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కుండపోత కురిసింది. జోగుళాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 60 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దుందుభీ వాగు ఉద్ధృతంగా పారడంతో డిండి ప్రాజెక్టు నిండింది. చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇల్లు కూలి నారాయణపేట జిల్లా మరికల్‌ కన్మనూరులో ఒకరు, నాగర్‌కర్నూల్‌ జిల్లా కుడికిళ్లలో ఒకరు, ధన్వాడలో ఒకరు మృతిచెందారు. 

  •  మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట్‌ మండలంలోని తిమ్మాపూర్‌కు చెందిన రాము, శ్రీశైలంతోపాటు మరో రైతు పెద్దవాగు వరదలో చిక్కుకున్నారు. అధికారులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. 
  • యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని గంధలమల చెరువు మత్తడిలో 2 ద్విచక్రవాహనాలు గల్లంతయ్యాయి. తుర్కపల్లి నుంచి మదర్‌డైయిరీ సిబ్బంది బొత్త మహేశ్‌, మధు ఒక బైక్‌పై గంధమల్లకు చెందిన శాగర్ల వెంకటేశ్‌ మరో బైక్‌పై గ్రామానికి వెళ్తున్నారు. నీటిలో బైక్‌లు కొట్టుకుపోగా, ముగ్గురు ప్రాణాలతో బయట పడ్డారు. 
  • మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ పరిధి విష్ణుపురి కాలనీకి చెందిన గందమోజు ప్రవీణ్‌కుమార్‌ (42), మోహన్‌ (15) అనే బాలుడితో కలిసి బైకుపై వెళ్తుండగా స్థానిక పెద్ద చెరువు కట్టపై ఉన్న అభయ ఆంజనేయ ఆలయ ప్రహరీ కూలి వారిపై పడగాఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు.

ఎల్లమ్మ చెరువు ప్రవాహంలో కొట్టుకుపోయిన 20 పశువులు   

జగిత్యాల జిల్లా పొలాసలో నీరు తాగేందుకు చెరువులోకి దిగిన 20 బర్లు మత్తడి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇటీవల కురిసిన వానలతో ఎల్లమ్మ చెరువు మత్తడి దుంకుతున్నది. గ్రామానికి చెందిన బర్ల కాపరులు రోజువారీలాగే పశువులను మేతకోసం తీసుకెళ్లగా.. 20 బర్లు నీళ్లు తాగేందుకు చెరువు మత్తడి వద్దకు వెళ్లి, నీటిలో పడి కొట్టుకుపోయాయి.  స్థానికులు గాలించగా, 10 బర్ల కళేబరాలు లభ్యమయ్యాయి. 

‘డిండి’ వాగులో చిక్కుకున్న గిరిజన దంపతులు

పొలం పనులకు వెళ్లిన గిరిజన దంపతులు డిండి వాగులో చిక్కుకున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలంలోని సిద్దాపూర్‌కు చెందిన సభావత్‌ విజయ-వెంకట్రాం దంపతులు బుధవారం ఉదయం పొలం పనులకు వెళ్లారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దుందుభీ నది ద్వారా డిండి ప్రాజెక్టుకు ప్రమాదకర స్థాయిలో నీరు చేరింది. సాయంత్రం 4 గంటల సమయంలో డిండి వాగు ప్రవాహం సిద్దాపూర్‌ పరిసరాల్లోకి చేరుకున్నది. ప్రవాహాన్ని గమనించని దంపతులు వాగు అవతల చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ కవిత, మాజీ ఎంపీపీ పర్వతాలు విషయాన్ని ప్రభుత్వ విప్‌ గువ్వల బాల్‌రాజు, కలెక్టర్‌ శర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే గువ్వల బాలరాజు.. దంపతులను రక్షించేందుకు సీఎం కేసీఆర్‌, సీఎస్‌తో మాట్లాడారు. వారిని రక్షించేందుకు హెలికాప్టర్‌ కావాలని విజ్ఞప్తిచేశారు. కలెక్టర్‌ శర్మన్‌, ఆర్డీవో పాండునాయక్‌, డీఎస్పీ నర్సింహులు, సీఐ రామకృష్ణ లు సాయంత్రమే నది వరకు చేరుకొని వారిని క్షేమంగా రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

కారిగుళ్ల వాగులో చిక్కుకున్న కుటుంబం.. మహిళ మృతి


 పొలానికి వెళ్లొస్తున్న క్రమంలో ఓ కుటుంబం వాగులో చిక్కుకున్నది. ఆరుగురు ప్రాణాలతో బయటపడగా, ఓ మహిళ మృతిచెందింది. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలోని షాపూర్‌లో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దశరథ్‌ తన భార్య అనితాబాయి, ఐదుగురు పిల్లలు, అత్త, మామతోపాటు మరొకరితో కలిసి పొలానికి వెళ్లారు. పనులు పూర్తి చేసుకొని ఇంటికి వస్తు న్న సమయంలో కారిగుళ్ల వాగును దాటుతున్న క్రమంలో కుమారుడు బాబు(6), కూతుర్లు సోనీ(15), మహేశ్వరి(13), వినోద(11), దేవి(9) వాగులో గల్లంతయ్యారు. నలుగురు పిల్లలను దశరథ్‌(38) అతని భార్య అనితాబాయి(30) కాపాడి ఒడ్డుకు చేర్చారు. అయితే కూతురు వినోదను కాపాడే ప్రయత్నంలో తల్లి అనితాబాయి వాగులో కొట్టుకుపోయి కల్కొడ చెరువులో శవమై తేలింది. కొంత దూరం వరద నీటిలో కొట్టుకుపోయిన వినోద చెట్టును పట్టుకొని ఒడ్డుకు చేరింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు తాళ్ల సాయంతో దశరథ్‌తోపాటు నలుగురు కూతుర్లు, కుమారుడు, అత్త(కమిలీబాయి), మామ(కిషన్‌), కూలీ(రేణుకాబాయి)ని వాగు దాటించారు. 


logo