ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:26:29

వాన కురిసింది.. పుడమి మురిసింది

వాన కురిసింది.. పుడమి మురిసింది

  • పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు
  • రాబోయే మూడు రోజులు భారీగా ..
  • హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి
  • ప్రారంభమైన సాగు పనులు

 హైదరాబాద్‌ , నమస్తే తెలంగాణ/ నెట్‌వర్క్‌: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం మహబూబాబాద్‌, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, నల్లగొండ, కామారెడ్డి, నిజామాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో వర్షం కురిసింది. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లో 14, గార్లలో 13, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 10.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హన్మకొండ, యాదగిరిగుట్టలో 12 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన గొర్రెల కాపరి మేకల రాజయ్య(65) పిడుగుపాటుకు మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లోని పలు చెరువుల్లోకి వరద నీరు చేరింది. కొత్తగూడెంలో 5.8, మణుగూరులో 0.3 సెంటీమీటర్ల వర్షం కురిసిం ది. ఖమ్మం జిల్లాలోని బోనకల్‌, మధిర, ఎర్రుపాలెం, చింతకాని, కొణిజర్ల, వైరా మండలాల్లో భారీవర్షం కురిసింది. గడిచిన 24గంటల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనూ పలుచోట్ల వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో 3.4, ఆదిలాబాద్‌ జిల్లాలో 2.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తొలకరి పలుకరించడంతో నిర్మల్‌, భైంసా,ఖానాపూర్‌, ఉట్నూర్‌, బోథ్‌, బేల,సిరికొండ మండలాల్లో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డిలో 2.8, నిజామాబాద్‌లో 2.1 సెంమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లాలోని 30 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మునుగోడులో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌ నగరంలోని హఫీజ్‌పేట, మియాపూర్‌, జగద్గిరిగుట్టలో తేలికపాటి జల్లులు కురిశాయి. 

చురుగ్గా నైరుతి రుతుపవనాలు

రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, రాగల 24 గంట ల్లో మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, మేఘాలయ, సిక్కింలోని అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర అధికారులు పేర్కొన్నారు.  నైరుతి రుతుపవనాలకుతోడు దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని చాలాచోట్ల శుక్ర, శనివారాల్లో ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఏపీలోకి నైరుతి రుతుపవనాలు

ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఆ రాష్ట్ర వాతావరణశాఖ గురువారం వెల్లడించింది. రాయలసీమ, కోస్తాంధ్రకు రుతుపవనా లు విస్తరించాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. రాయలసీమలో చెదురుముదురుగా తేలికపాటి జల్లులు పడుతాయని పేర్కొన్నారు.  


logo