బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 06:41:26

తెలంగాణ వ్యాప్తంగా జోరు వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా జోరు వర్షాలు

హైదరాబాద్‌ : తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల వరదల్లో పలువురు కొట్టుకుపోయి గల్లంతయ్యారు. తీవ్ర వాయుగుండం నేడు తీరం దాటనుండగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్‌-విశాఖపట్నం మధ్యలో కాకినాడకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.

మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్ల నుంచి ఎస్పీల వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పోలీస్‌శాఖకు డీజీపీ అప్రమత్తం చేశారు. కాగా, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వనపర్తి పట్టణ శివారులోని జెర్రిపోతుల మైసమ్మ దగ్గర వాగులో ఇద్దరు గల్లంతయ్యారు. కాసేపటికే ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వాగు దాటుతుండగా.. జారి కిందపడ్డారు. స్థానికులు రక్షించడంతో పాటు ప్రాణాలతో బయటపడ్డాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు వద్ద కేఎల్‌ఐ ప్రధాన కాలువలో జార్ఖండ్‌కు చెందిన కార్మికుడు పడి గల్లంతయ్యాడు. ఫైర్‌ రెస్క్యూ బృందం గాలింపు చర్యలు చేపట్టాయి. 

పలు జిల్లాల్లో భారీ వర్షాలు

వాయుగుండం నేపథ్యంలో ఇవాళ్టి ఉదయం వరకు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా వెంసూర్‌లో 18.7 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షాపాతం రికార్డయింది. అలాగే నాగర్‌కర్నూల్‌, నల్గొండ, వనపర్తి, సూర్యపేట, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, అర్బన్‌, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, జనగామ, రంగారెడ్డి సహ హైదారాబాద్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, సిద్దిపేట, కుమ్రం భీం తదితర జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షం కురవగా.. మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.


logo