గురువారం 28 మే 2020
Telangana - May 07, 2020 , 01:42:15

రెండురోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు

రెండురోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు

  • కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
  • బుధవారం పలుజిల్లాల్లో వాన

నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో: ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం, తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల  ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనికి తోడు దక్షిణ అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో  ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి, దానికి అనుబంధంగా మధ్యస్త ట్రోపోస్పియర్‌ స్థాయిల ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపారు. వాటి ప్రభావంతో రాగల రెండు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు. 

అంతేకాకుండా రాష్ట్రంలో అక్కడక్కడ గరిష్ఠ  ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశమున్నట్లు తెలిపారు. కొమ్రంభీం అసిఫాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల,  సిద్దిపేట తదితర జిల్లాలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పాతబస్తీ, రాజేంద్రనగర్‌, శివరాంపల్లి, మెహిదీపట్నం, నాంపల్లి, అబిడ్స్‌, చార్మినార్‌, ఆసిఫ్‌నగర్‌, సైదాబాద్‌ తదితర ప్రాంతాల్లో బుధవారం వర్షం కురిసింది.  రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం మొర్రాపూర్‌లో ఈదురుగాలులకు ఇంటి ముందు వేసిన రేకులు ఎగిరిపడి పారిశుద్ధ్య కార్మికురాలు బట్టు లచ్చవ్వ మృతిచెందింది.logo