హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని పేర్కొన్నది. ఇది సోమవారం ఉదయం ఉత్తర కోస్తా ఒడిశా వద్ద చాంద్బలీకి పశ్చిమ వాయవ్య దిశగా 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు తెలిపింది.
రాగల 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించి, ఆ తరువాత 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నట్టు వివరించింది. రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నట్టు పేర్కొన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.