మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 02:52:21

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో ఆదివారం రాత్రి, సోమవారం వర్షం దంచికొట్టింది. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ధాటికి అక్కడక్కడా రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆదివారం రాత్రంతా, సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వర కు భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నల్లగొండ జిల్లా శాలిగౌరారం ప్రాజెక్టు పరిధిలోని రాచకాల్వకు వరద పోటెత్తడంతో గండిపడింది. దాని కింద ఉన్న పొలాలు నీటమునిగాయి. వే ములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెంలోని బంధం వాగుకు వరద పోటెత్తగా భీమారం-సూర్యాపేట రోడ్డు పై రాకపోకలు నిలిచిపోయాయి.

పాలేరువాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పంటచేలు నీటమునిగాయి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో ఓ ఇంటిపై పిడుగుపడగా పైకప్పు ధ్వంసమైంది. ఇంటి ఆవరణలో కట్టేసిన రెండు గేదెలు మృత్యువాతపడ్డాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లిలో 10.1సెంటీమీటర్లు, సూర్యాపేటలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం అంకంపల్లి స్టేజీ వద్ద గల కల్వర్టు కోతకు గురైంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌లోని గుండివాగు వద్ద నిర్మించిన కల్వర్టు కొట్టుకుపోవడంతో దాని కింద ఉన్న వరి పొలాలు నీటమునిగాయి. కామారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా వర్షా లు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం, యాదాద్రి జిల్లా వలిగొండలో భారీ వర్షం కురిసింది. logo