గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 01:34:01

వాయుగుండం ప్రభావంతో భారీ వర్షం

వాయుగుండం ప్రభావంతో భారీ వర్షం

  • రాబోయే మూడ్రోజులు  భారీ నుంచి అతిభారీ వర్షాలు
  • నేటి ఉదయానికి తీవ్ర  వాయుగుండంగా మారే అవకాశం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: అనుకున్నట్టే పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగి ఆగి నిండుకుండను కుమ్మరించినట్టు కురిసిన వానలకు పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహించాయి, చెరువులు మత్తడి దుంకాయి. లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్‌ సహా మెదక్‌, సిద్దిపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్‌ వికారాబాద్‌, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. ఏపీలోని కాకినాడకు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం మంగళవారం తెల్లవారుజాము వరకు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది. అది పశ్చిమ దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్‌తీరంలో నర్సాపూర్‌, విశాఖపట్నం మధ్య కాకినాడకు దగ్గరలో మంగళవారం తీరాన్ని దాటే అవకాశం ఉన్నది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలోని అనేక జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొన్నది. పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఇదిలా ఉండగా, వనపర్తిలో కురిసిన భారీ వర్షానికి జెర్రిపోతుల వాగు ఉధృతి పెరిగి ఆ ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయారు.

నైరుతి తిరోగమనంలో అసాధారణ జాప్యం

నైరుతి రుతుపవనాల తిరోగమనంలో ఈసారి అసాధారణ జాప్యం నెలకొన్నది. సాధారణంగా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకే నైరుతి రుతుపవనకాలం ఉంటుంది. అయితే బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, వాయుగుండాలు ఉత్ప న్నం కావడం వల్ల ఈసారి అసాధారణ జాప్యం కలుగుతున్నదని వాతావరణ శాఖ పేర్కొన్నది.


logo