ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 02:20:43

రాష్ట్రమంతా కుండపోత

రాష్ట్రమంతా కుండపోత

  • ఉప్పొంగిన వాగులు.. అలుగులు దుంకిన చెరువులు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో బుధవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. చెరువులు అలుగులు పోశాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల, పొచ్చెర, కనకాయి జలపాతాలు పరవళ్లు తొక్కాయి. ఎగువన మహారాష్ట్ర వాగుల నుంచి వరద నీరు వస్తుండటంతో ప్రస్తుతం పెన్‌గంగలో నాటు పడవలు నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా బాసర వద్ద గోదావరి నది పుష్కర ఘాట్ల వద్ద మూడు మెట్లు ఎగువన నీరు ప్రవహిస్తుంది.

పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సరాసరి 14.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం, కొత్తగూడెం పట్టణాలు జలమయమయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలంలోని పెద్దచెరువు మత్తడి దుంకుతున్నది. నల్లగొండ జిల్లాలో జూన్‌ ఒకటి నుంచి బుధవారం నాటికి సాధారణ వర్షపాతం కంటే 27శాతం అదనంగా నమోదు కాగా సూర్యాపేట జిల్లాలో 56 శాతం ఎక్కువ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఈసీ-మూసీ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.  వికారాబాద్‌ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టు పరిగి మండలంలోని లాఖ్నాపూర్‌ ప్రాజెక్టు రెండేండ్ల తర్వాత జలకళను సంతరించుకొన్నది. 


logo