గురువారం 09 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 01:47:01

ముసురుకొన్న వాన

ముసురుకొన్న వాన

  • రాష్ట్రంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావం
  • పలు జిల్లాల్లో వర్షం
  • నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీగా..  
  • నిలకడగా నైరుతి రుతుపవనాలు

రాష్ట్రంపై ముసురు కమ్ముకొన్నది. అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాత్రి మొదలైన వాన బుధవారం సాయంత్రం దాకా కురిసింది.  గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో  విస్తారంగా కురిసిన వానతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.  గ్రామాల్లో పొలాలు, చెరువుల్లోకి నీరు చేరింది. గ్రేటర్‌ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో అత్యధికంగా 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురు, శుక్రవారాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావారణశాఖ తెలిపింది.  నైరుతి రుతుపవనాలు నిలకడగా విస్తరిస్తున్నాయని వెల్లడించింది.


హైదరబాద్‌, నమస్తే తెలంగాణ: తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసరప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతున్నది. దాని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే రెండురోజులపాటు పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ప్రధానంగా ములుగు, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జనగామ జిల్లాల్లో గురువారం ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు, శుక్రవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావంతో వాతావరణం వర్షాలకు అత్యంత అనుకూలంగా మారిందన్నారు. నైరుతి రుతుపవనాలు నిలకడగా విస్తరిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులో చాలాప్రాంతాలు, కర్ణాటక, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి విస్తరించినట్టు వెల్లడించారు.   

పలు జిల్లాల్లో వర్షం 

అల్పపీడన ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లా ల్లో వర్షం కురిసింది. ఈదురుగాలుల దాటికి  పలు ప్రాంతా ల్లో చెట్లు నేలకూలాయి. నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌, నార్నూర్‌, భీంపూర్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో ఉదయం భారీ వర్షం కురిసింది. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షం కురిసింది. మందమర్రి సోమగూడెం రోడ్డులో చొప్పరిపల్లి సమీపంలో భారీ వృక్షం నేలకొరగడంతో వాహనాలు నిలిచిపోయాయి.  ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది.  సిద్దిపేట జిల్లాలో మంగళవారం రాత్రి పలుచోట్ల భారీ వాన పడింది.

బుధవారం సాయంత్రం మెదక్‌, సంగారెడ్డి పట్టణంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నల్లగొండ జిల్లాకేంద్రంతో పాటు మునుగోడు, చండూరు, కనగల్‌, గుర్రంపోడు, సూర్యాపేట జిల్లాలోని మునగాల, నాగారం మండలాల్లో వర్షం కురిసింది. వరంగల్‌, హన్మకొండలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షంతో నగరం తడిసిముద్దయ్యింది. మహబూబాబాద్‌ జిల్లా గార్ల, బయ్యారం, కురవి మండలాల్లో వర్షం కురిసింది. కమలాపూర్‌ మండలం మర్రిపల్లిగూడెంలో పిడుగుపడి వంగ శ్రీనివాస్‌కు చెందిన రెండు ఎద్దులు చనిపోయాయి.    


పిడుగుపాటుకు రైతు మృతి

రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం మొర్రాపూర్‌లో పిడుగుపాటుకు బందనకల్‌ గ్రామానికి చెందిన గురుకుల రాములు (45) మృతి చెందాడు.

గ్రేటర్‌లో విస్తారంగా వర్షాలు

ఉపరితల ఆవర్తనద్రోణికి తోడు మాన్‌సూన్‌ సీజన్‌ వస్తుండటంతో గ్రేటర్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తన ప్రభావంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బుధవారం గ్రేటర్‌ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో అత్యధికంగా 7.8 సెంటీమీటర్లు, అత్యల్పంగా మైలార్‌దేవ్‌పల్లిలో 1.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్‌ అధికారులు వెల్లడించారు.


logo