శనివారం 30 మే 2020
Telangana - May 17, 2020 , 02:01:32

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం

  • అరగంటపాటు భారీ వర్షం
  • కూలిన చెట్లు, హోర్డింగులు
  • జలమయమైన రోడ్లు

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: హైదరాబాద్‌లో శనివారం వర్షం బీభత్సం సృష్టించింది. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా దాదాపు అరగంటపాటు పలు ప్రాంతాల్లో భారీగా కురిసిం ది. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, హోర్డింగ్‌లు కూలిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని షేక్‌పేటలో 5.5 సెంటీమీటర్లు, అమీర్‌పేట మైత్రీవనంలో 5.4 సెంటీమీటర్లు, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌తోపాటు పలుప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్ష తీవ్రతకు చాలాచోట్ల కార్లు, ద్విచక్ర వాహనాలు నీటమునిగాయి. కొన్నిచోట్ల విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. 

మున్ననూరులో దంపతుల మృతి..

గాలివానకు మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల-కల్వకుర్తి ప్రధాన రహదారిపై మున్ననూరు గ్రామ సమీపంలో కొత్తగా నిర్మించిన టోల్‌గేట్‌ షెడ్డు కూలడంతో అక్కడే వడ్లను ఆరబోసిన అదే గ్రామానికి చెందిన రైతు దంపతులు కృష్ణయ్య(36), పుష్పమ్మ(32) దుర్మరణం చెందారు. ఖమ్మం నగరంతోపాటు పలు మండలాల్లో శనివారం సాయం త్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రఘునాథపాలెం, చింతకాని మండలాల్లో బొప్పాయి తోటలు నేలకొరిగాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్లలో పిడుగుపడి గొర్రెలకాపరి బసవయ్య(40) మృతిచెందాడు. తుంబూరులో ఓ ఇల్లు కూలగా మహిళ గాయపడింది. వికారాబాద్‌ జిల్లా దోమ మండలం అయినాపూర్‌లో పిడుగుపాటుకు ఆవు మృత్యువాత పడింది.

బంగాళాఖాతంలో తుపాను

  • నేడు,రేపు ఓ మోస్తరు వానలు
  • నేడు అండమాన్‌కు ‘నైరుతి’ 

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఆదివారం ఉదయం వరకు తుపాను గా మారే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఆదివారం అది ఉత్తరవాయవ్య దిశగా ప్రయాణించి రెండు రోజుల్లో పశ్చిమబెంగాల్‌ తీరం వైపు వెళ్లే అవకాశం ఉన్నదన్నారు. ఈ ప్రభావంతో ఆది,సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు  కురిసే అవకాశం ఉన్నదన్నారు. ఆదివారం వరకు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌, నికోబార్‌ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు తాకవచ్చని తెలిపారు.


logo