సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 12, 2020 , 01:29:26

తెలంగాణకే వలసలు

తెలంగాణకే వలసలు
  • ఉమ్మడి వరంగల్‌కు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ కూలీలు
  • ఉపాధి కోసం తరలొచ్చిన ప్రజలు
  • కిటకిటలాడుతున్న కాజీపేట రైల్వే జంక్షన్‌

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : కూలీకోసం.. కూటి కోసం ఉన్న ఊళ్లను వదిలి దూర తీరాలకు వలసెల్లిన తెలంగాణ ఇప్పుడు ఇతర ప్రాంతాలకు ఉపాధి తొవ్వలేస్తున్నది. మన కూలీలకు చేతినిండా పనిదొరకడమే కాదు.. మధ్యభారతానికి ఎవుసం పనుల కూలీ రుచి చూపిస్తున్నది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి ఈసారి వేలమంది కూలీలు పనికోసం రాష్ర్టానికి తరలివస్తున్నారు. వరంగల్‌ ఉమ్మడిజిల్లాలోని అనేక ప్రాంతాల్లో  పొరుగురాష్ర్టాల కూలీలు సంబురంగా పనులు చేసుకుంటున్నారు. మహారాష్ట్రలోని రాజూరా, చంద్రాపూర్‌, బల్లార్షా, సిరొంచ, గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌, సుక్మా ప్రాంతాల నుంచి కుటుంబాలకు కుటుంబాలే మన మిర్చి తోటల్లో పనిచేసేందుకు తరలివస్తున్నాయి. కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, మధిర, ఖమ్మం రైల్వేస్టేషన్లు వలసకూలీల రాకపోకలతో కళకళలాడుతున్నాయి. 


అక్కడ రైతులు.. ఇక్కడ కూలీలు 

‘మహారాష్ట్రలో మేము రైతులం. కానీ పనుల్లేక తెలంగాణకు వచ్చిన కూలీలం’ అని చంద్రాపూర్‌ జిల్లా సాంవ్లీకి చెందిన రాందాస్‌ దాగో కామ్డా అనే రెండున్నర ఎకరాల రైతు ‘నమస్తే తెలంగాణ’తో చెప్పాడు. తమప్రాంతంలో నీరు లేక ఒక్క పంట పండటమే కష్టంగా ఉన్నదనీ.. తెలంగాణతరహాలో తమప్రాంతంలో ప్రభుత్వ ప్రోత్సాహంలేదని మహారాష్ట్ర రైతులు పేర్కొంటున్నారు. మిర్చి, పత్తి సీజన్‌లో తెలంగాణకు వచ్చి పనులుచేసి తిరిగి సొంతూళ్లకు వెళ్లే ఇతర రాష్ర్టాల కూలీలతో రైల్వేస్టేషన్లు సందడిగా మారుతున్నాయి. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని ములుగు, గోవిందరావుపేట, మంగపేట, తాడ్వా యి, నల్లబెల్లి, ఖానాపూర్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, కురవి, మరిపెడ, కాటారం, మహదేవ్‌పూర్‌, మహాముత్తారం తదితర ప్రాంతాల మిర్చి తోటల్లో పనిచేసేందుకు ఆయా రాష్ర్టాల కూలీలు భారీగా తరలివస్తున్నారు. 


బహుత్‌ అచ్చా సర్కార్‌.. అచ్చా ఖేత్‌ 

‘తెలంగాణ మే బహుత్‌ అచ్చా సర్కార్‌ హై.. అచ్చా ఖేత్‌ బీ హై..’ అంటూ మహారాష్ట్ర కూలీలు కితాబిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమాతోపాటు 24గంటల ఉచిత కరంట్‌ ఇవ్వటంఅంటే మాటలు కాదని అక్కడికూలీలు తమ ప్రాంతంలో నెలకొన్న దుస్థితుల్ని సరిపోల్చి చూసుకుంటున్నారు. తెలంగాణలో ఎక్కడచూసినా పచ్చని పంటపొలాలు కనిపిస్తున్నాయని.. తమ ప్రాంతానికి ఇక్కడికి చాలా తేడా ఉన్నదని పేర్కొంటున్నారు. 


జోడికి ఆరేడు వందల కూలీ 

కురవి దగ్గర మిర్చీ తోటలు ఏరినం. నెలరోజుల కింద వచ్చినం. నేను నా భార్య, బిడ్డ ముగ్గురం వచ్చినం. జోడికి (భార్యా భర్తలకు) రోజుకు ఆరేడు వందల కూలీ గిట్టుబాటైంది. నాకు మా ఊళ్లో అరెకరం భూమిలో వ్యవసాయం చేసేటోన్ని. మా దగ్గర వ్యవసాయ పనులు అయ్యాక పనుల్లేక ఖాళీగా ఉంటం. అందుకే ఇక్కడికి వచ్చినం. మంచి కూలి పడ్డది.

- ప్రకాశ్‌ కవుడు బోయర్‌, మహారాష్ట్ర 


కాలేజీకి సెలవు పెట్టి వచ్చిన

నేను పదకొండో తరగతి చదువుతున్న. ఇంటి ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మా గ్రామం వాళ్లు ఇక్కడికి మిర్చీతోటల్లో పనిచేసేందుకు వస్తున్నారని తెలి సి కాలేజీకి సెలవుపెట్టి వచ్చిన. మా అన్నా కూడా ఇక్కడికే కూలీ పని కోసం వచ్చిండు. ఇక్కడి వాళ్లు పనులిచ్చిండ్లు.  పైసలు టైంకిచ్చిండ్లు.

- వినోద్‌ గుర్నూల్‌  


logo