గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:46:05

యజ్ఞంలా హరితహారం

యజ్ఞంలా హరితహారం

  • భారీగా నాటుతున్న మొక్కలు
  • ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, ప్రజలు
  • వర్షాలతో మొక్కలకు జీవం 

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: ఆరోవిడత హరితహారం యజ్ఞంలా సాగుతున్నది. గతనెల 25న మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన ఈ కార్యక్రమం 12రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా నడుస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగు లు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటుతున్నా రు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హరితహారం కార్యక్రమంలో భాగంగా.. నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మంలోని రవాణా శాఖ కార్యాలయ ఆవరణలో ఆ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సూర్యాపేట జిల్లాలో విద్యు త్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, హైదరాబాద్‌లో రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిలు మొక్కలు నా టారు. హరితహారం ప్రారంభమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తం గా చిరుజల్లుల నుంచి ఓ మాదిరి వర్షాలు కురుస్తుండటం తో నాటిన మొక్కలకు జీవం పోసినట్లయింది. ఇలాంటి వాతావరణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 

అర్బన్‌ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత

ఆరోవిడత హరితహారంలో అర్బన్‌ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నది. పట్టణాలు, నగరాల్లో తక్కువ ప్రాంతంలో ఎక్కువ మొక్కలు నాటేలా యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ను చేపడుతున్నారు. ఇప్పటికే నర్సాపూర్‌, చౌటుప్పల్‌, యాదాద్రి-భువనగిరిలో నిర్మించిన అర్బన్‌ ఫారెస్ట్‌లు ఇచ్చిన ఫలితాల స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో అర్బన్‌ ఫారెస్ట్‌ల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించి, ఆ దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నది. పట్టణ ప్రాంతాలు, సమీప ప్రాంతాల్లోని ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా ఈ పార్కులను  ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

నాలుగు వేల గ్రామాల్లో ఈత, తాటి మొక్కలు..

హరితహారంలో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది నాలుగు వేల గ్రామ పంచాయతీల్లో ఒక్కో గ్రామానికి వెయ్యి చొప్పున తాటి, ఈత మొక్కలు నాటుతున్నారు. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామంలో సోమవారం ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో 4 వేల మొక్కలను నాటారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో బాసర ట్రిపుల్‌ ఐటీలో 50 వేల మొక్కలు నాటారు. మిగతా శాఖల వారు సైతం పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు.


logo