శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 03:00:06

ప్రాజెక్టులకు వరద పోటు

ప్రాజెక్టులకు వరద పోటు

  • దంచికొడుతున్న వానలతో భారీగా ఇన్‌ఫ్లోలు
  • వచ్చిన నీరు వచ్చినట్టే దిగువకు..

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: మూడు రోజులుగా దంచికొడుతున్న వర్షాలతో కృష్ణా, గోదావరి పరవళ్లు తొక్కుతున్నాయి. ఇప్పటికే నిండుకుండల్లా మారిన ప్రాజెక్టులకు మళ్లీ వరద పోటెత్తడంతో వచ్చిన నీరు వచ్చినట్టే దిగువకు పరుగులు తీస్తున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్లలోని అన్ని ప్రాజెక్టులకు భారీగా ఇన్‌ఫ్లోలు నమోదవుతున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి మొదలు నాగార్జునసాగర్‌ వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ అధికారులు గేట్లను ఎత్తి వరదను నదిలోకి వదులుతున్నారు. జూరాలలో 25 గేట్లు, శ్రీశైలంలో పది గేట్లు, నాగార్జున సాగర్‌లో 18 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో భారీగా పెరగడంతో 30 గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.80 టీఎంసీలకు గాను మంగళవారం సాయంత్రానికి 9.32 టీఎంసీలకు చేరుకున్నది. ఎగువ నుంచి నీటి ప్రవాహం పెరగడంతో శ్రీరాజరాజేశ్వర(మధ్య మానేరు) జలాశయంలోని నాలుగు గేట్లు, కరీంనగర్లోని ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎల్‌ఎండీలో 24.034 టీఎంసీలకు ప్రస్తుతం 23.602 టీఎంసీల నిల్వ ఉన్నది. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి బరాజ్‌కు వరద పోటెత్తడంతో 20 గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దిగువన మంథని మండలం సిరిపురంలో పార్వతీ బరాజ్‌లోనూ 60 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో సరస్వతీ బరాజ్‌కు వదులుతుండడంతో 110 కిలోమీటర్ల గోదావరి తీరం నిండుకుండలా కనిపిస్తున్నది.