మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 02:14:01

శ్రీశైలానికి భారీగా వరద

శ్రీశైలానికి భారీగా వరద

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్‌: కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఆల్మట్టికి 1.88 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, టీబీ డ్యాంకు వరద నిలకడగా కొనసాగుతున్నది. జూరాలకు 1.35 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా 29 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైల జలాశయానికి వరద ఉధృతంగా వస్తుండటంతో రిజర్వాయర్‌ నిండుకుండను తలపిస్తున్నది. సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు శ్రీశైలానికి 2,65,872 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, నాలుగు క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. మరోవైపు గోదావరి బేసిన్‌లో కూడా వరద తగ్గుముఖం పడుతున్నది. శ్రీరాంసాగర్‌కు 11 వేల క్యూసెక్కుల పైచిలుకు వరద మాత్రమే ఉన్నది. ఎల్లంపల్లికి స్వల్పంగా ఆరు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే అవుట్‌ఫ్లో కూడా అంతే నమోదవుతున్నది.

తగ్గుముఖం పట్టిన గోదావరి

ఇటీవల కురిసిన వర్షాలకు నిండుకుండలా మారిన గోదావరి సోమవారం కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టింది. సరస్వతి బరాజ్‌కు 38వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. 10.87 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 7.96 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. లక్ష్మి బరాజ్‌కు 3,46,730 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 65 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో బయటకు వదులుతున్నారు. ప్రస్తుతం ఈ బరాజ్‌లో 3.686 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.logo