గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 02:38:13

నాగార్జునసాగర్‌కు భారీగా వరద

నాగార్జునసాగర్‌కు భారీగా వరద

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. బుధవారం నాగార్జునసాగర్‌, శ్రీశైలం, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులకు వరద భారీగా వచ్చి చేరింది. జూరాలకు 1,60,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉం డగా, 1,41,773 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో న మోదైంది. శ్రీశైలం డ్యామ్‌కు బుధవారం సాయంత్రానికి 2,89,855 ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండటంతో డ్యాం పది గేట్లను పది అడుగుల ఎత్తులో తెరిచి నీటి ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు. అవుట్‌ఫ్లో 3,07,946 క్యూసెక్కులుగా నమోదైంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామ ర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 884.30 అడుగుల వద్ద 211.4759 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. నాగార్జునసాగర్‌కు 3,57,560 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 20 క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను 589.50 అడుగులకు చేరుకొని 310.5510 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. సాగర్‌ నుంచి మొత్తం 369417 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది.

 గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 1,46,874 ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు 32 వరద గేట్ల ద్వారా 1.25 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తి స్తాయినీటిమట్టం 1091 అడుగులు 90.313 టీఎంసీలు కాగా బుధవారం సాయంత్రానికి 1090.00 అడుగులు (84.810 టీఎంసీల) నీటినిల్వ ఉన్నదని అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని సిం గూర్‌కు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 20 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కాగా వారం రోజులు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లికి 2,28,703 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 25 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువన గల పార్వతి బరాజ్‌కు విడుదల చేస్తున్నారు. పార్వతి బరాజ్‌ 60 గేట్లు ఎత్తి దిగువన సరస్వతి బరాజ్‌లోకి అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. ఎస్సారార్‌ జలాశయానికి 11,072 ఇన్‌ఫ్లో రాగా, ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి ఎల్‌ఎండీకి నీటి 15,794 క్యూసెక్కుల నీటిని వదిలారు.