ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 11:15:59

కృష్ణా ప్రాజెక్టులకు భారీ వరద.. గేట్లు ఎత్తివేత

కృష్ణా ప్రాజెక్టులకు భారీ వరద.. గేట్లు ఎత్తివేత

హైదరాబాద్‌ : పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. నది పరీహవాక ప్రాంతాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి చేరుతోంది. జూరాల ప్రియదర్శిని డ్యామ్‌కు 1,05,007 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 1,62,440 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1044 అడుగుల నీరుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.8454 టీఎంసీలుంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. ఇన్‌ఫ్లో 2,47.032 క్యూసెక్కులు వస్తుండడంతో శ్రీశైలం ఏడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి 2,22,750 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 885 అడుగులు కాగా, ప్రస్తుత 884.80 అడుగుల నీరుంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు, ప్రస్తుతం 214.84 టీఎంసీలు ఉంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో 16 గేట్లు పది ఫీట్ల మేర ఎత్తి దిగువకు విడుదల ప్రాజెక్టుకు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2,76,778 క్యూసెక్కులు వస్తుండగా అదే మొత్తంలో దిగువకు విడిచిపెడుతున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు, ప్రస్తుత నిల్వ 310.55 టీఎంసీలు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుత నిల్వ 589.5 అడుగులు మేర నీరుంది. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ప్రాజెక్టులకు వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo