మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 07:09:09

సంక్రాంతికి పల్లెబాట పట్టిన పట్నం వాసులు

సంక్రాంతికి పల్లెబాట పట్టిన పట్నం వాసులు

హైదరాబాద్‌ : పట్నం వాసులు పల్లెబాట పట్టారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంత ఊళ్లకు బయలుదేరారు. దీంతో పండుగలకు వెళ్తున్న జనం హైదరాబాద్‌ నగరంలోని బస్టాండులు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. పండుగ నేపథ్యంలో ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తోంది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్పటికప్పుడు బస్‌ సర్వీసులు పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నుంచి ఎక్కువగా ఏపీలోని వివిధ ప్రాంతాలకు ఎక్కువగా జనం వెళ్లనుండగా.. ఈ మేరకు అధికారులు ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నారు.

పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో పెట్టుకొని 4,980 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3,380 ప్రత్యేక బస్సులు, ఏపీకి 1,600 బస్సులను నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విజయవాడ, విశాఖపట్టణం, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు వంటి ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో పాటు ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్, ఈసీఐఎల్‌, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, లింగంపల్లి, చందానగర్, టెలిఫోన్ భవన్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రయాణ ప్రాంగణాల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి.

అలాగే సికింద్రాబాద్‌, నాంపల్లి రైల్వేస్టేషన్లు సైతం ప్రయాణికులతో కిటకిటలాడాయి. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలను దృష్టిలో పెట్టుకొని ఆ మార్గంలో మంగళవారం నుంచి ఈ నెల 17 వరకు సికింద్రాబా ద్‌, కాచిగూడ, హైదరాబాద్‌(నాంపల్లి), లింగంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి ఫెస్టివల్‌ స్పెషల్‌ ట్రైన్స్‌ నడుపుతోంది. ముందస్తుగా రిజర్వేషన్‌ చేసుకున్న వారితోనే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. కరోనా  నేపథ్యంలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లలో ప్రయాణికుల అనుమతిపై పరిమితులు విధించారు. ఈ రైళ్లలో సీటు రిజర్వైన వారినే స్టేషన్‌ లోపలికి అనుమతిస్తున్నారు. 


logo