సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 02:48:29

బీజేపీ రాష్ర్టాల్లో కరోనా కల్లోలం

బీజేపీ రాష్ర్టాల్లో కరోనా కల్లోలం

  • వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నామమాత్రమే.. 
  • గుజరాత్‌లో పదిలక్షల మందిలో 84 పరీక్షలే.. 
  • మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి
  • ప్రధాని సొంత రాష్ట్రంలోనే 1685 మరణాలు
  • హిమాచల్‌ప్రదేశ్‌లో ‘పీపీఈ’ కుంభకోణం
  • కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వంపై అక్కసుతో విమర్శలు

‘కరోనా వైరస్‌పై అవగాహన కల్పించడంలో సఫలం.. వైరస్‌ విస్తరించకుండా పకడ్బందీ చర్యలు.. వ్యూహాలు.. అందుబాటులో వైద్య సదుపాయాలు.. ఎక్కడికక్కడ కంటైన్మెంట్‌ జోన్లు.. నిర్ధారణ పరీక్షలు పెంపు.. ఫలితంగా తెలంగాణలో తక్కువ మరణాలు, ఎక్కువ రికవరీ రేటు’ రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో తెలంగాణలో పరిస్థితి

‘సరైన వ్యూహం లేదు, లాక్‌డౌన్‌ నిబంధనల అమలులో విఫలం, వైరస్‌ కట్టడికంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం.. బాధితులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం.. వెరసి కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మరణాలూ చోటుచేసుకుంటున్నాయి’.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితి ఇది 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కొన్ని రాష్ర్టాల ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి వేగం తగ్గుముఖం పట్టి కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. అదే సమయంలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నదని అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అక్కడి ముఖ్యమంత్రులు ఎలాంటి వ్యూహాలు అనుసరించకపోవటంతో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని ఆరోపిస్తున్నాయి. వైరస్‌ వల్ల మరణించే వారి సంఖ్య ఎక్కువవుతున్నదని, రికవరీ సంఖ్య తక్కువగా ఉంటున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువమంది మరణించగా, మూడోస్థానంలో గుజరాత్‌ నిలుస్తున్నది.  బీజేపీపాలిత కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌ తదితర రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. 

పదిలక్షల మందికి పదుల సంఖ్యలో పరీక్షలు

ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌లో రోజుకు ప్రతి పదిలక్షల మందిలో సగటున కేవలం 84 మందికే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో 75, ఉత్తరప్రదేశ్‌లో 53 పరీక్షలే నిర్వహిస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. అధిక జనాభా ఉన్న ఈ రాష్ర్టాల్లో పరీక్షల నిర్వహణ దారుణంగా ఉండటంపై ప్రతిపక్షాలు, ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ మద్దతుతో అధికారంలోకి వచ్చిన బీహార్‌లోనూ పదిలక్షల మందికి సగటున 29 మందికే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

గుజరాత్‌లో మరణాలెక్కువ

గుజరాత్‌లో ఇప్పటివరకు 27,880 కరోనా కేసులు కాగా, 1,685 మంది చనిపోయారు. ఇతర రాష్ర్టాలతో పోల్చితే గుజరాత్‌లోనే కరోనా మరణాల రేటు అధికంగా ఉండటం ఆందోళనపరుస్తున్నది. ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలంకావడం, బాధితులకు సకాలంలో చికిత్స అందించకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. 


చేతులెత్తేసిన ఉత్తరప్రదేశ్‌ సర్కారు

ఉత్తరప్రదేశ్‌లో 18,322 పాజిటివ్‌ కేసులు ఉండగా, 560 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షణాలు ఉన్నవారికి సైతం ప్రభు త్వం పరీక్షలు చేయడంలేదని, మరణాల సంఖ్యను తగ్గించి చెప్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వలస కూలీలు రాష్ర్టానికి రావడంతో ప్రభుత్వం చేతులెత్తేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 

మధ్యప్రదేశ్‌లో రాజకీయాలపైనే దృష్టి

మధ్యప్రదేశ్‌లో 12 వేలకుపైగా కేసులు నమోదుకాగా, 521 మంది వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు ఇస్తున్న ప్రాధాన్యం.. కరోనా కట్టడికి ఇవ్వడంలేదని ప్రజలు మండిపడుతున్నారు. 

కర్ణాటకలో విఫలం

కర్ణాటకలో 9,400 వరకు కేసులు కాగా, 142 మంది మరణించారు. పాజిటివ్‌ వచ్చిన వారిని హోంక్వారంటైన్‌ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించాయి. 

హర్యానాలో చాపకింద నీరులా..

హర్యానాలో పాజిటివ్‌ కేసులు 11 వేలకు చేరుకోగా, ఇప్పటివరకు 169 మంది మరణించారు. లాక్‌డౌన్‌ ఎత్తివేతతో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను అడ్డుకోవటంపై  ప్రభు త్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ప్రజలు మండిపడుతున్నారు.

హిమాచల్‌లో పీపీఈ కుంభకోణం

కరోనా కష్టకాలంలో బీజేపీపాలిత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో వైద్య పరికరాల కుంభకోణం జరిగింది. ఇందులో పాత్ర ఉన్నట్టు ఆరోపణలు రావటంతో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్‌ బిందాల్‌ పదవికి రాజీనామా చేశారు. వైద్య పరికరాల కొనుగోలు కోసం ఇక్కడ ప్రత్యేక విభాగాలు లేవు.

తెలంగాణ ఎంతో మేలు

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో శ్రమిస్తున్నది. అన్ని శాఖల సమన్వయంతో జిల్లాల్లో కరోనా వ్యాప్తి జరుగకుండా అడ్డుకున్నది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 50 వేల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రోజూ 7 వేలకుపైగా నిర్ధారణ పరీక్షలు చేసే సామర్థ్యం ఉన్నది. నిర్దేశించిన ధరలకు ప్రైవేటు డయాగ్నోస్టిక్స్‌ సెంటర్లలో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించింది. కరోనా చికిత్స కోసం గచ్చిబౌలిలో టిమ్స్‌ దవాఖానను ఏర్పాటుచేసింది. వేగంగా కరోనా పరీక్షలు చేసేందుకు కోబాస్‌-8800 అనే హైస్పీడ్‌ ఆర్టీపీసీఆర్‌ మెషిన్లను రాష్ర్టానికి తెప్పిస్తున్నది. ఒక్కో మిషన్‌ ఒకేరోజు దాదాపు 4 వేల వరకు పరీక్షలు చేయగలదు. ఇవి అందుబాటులో వస్తే ఒక్కరోజు 15,000 పరీక్షలు చేయొచ్చు.


logo