మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 12:27:45

వనపర్తిని ముంచెత్తిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం

వనపర్తిని ముంచెత్తిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం

వనపర్తి : వనపర్తి జిల్లాను వర్షం ముంచెత్తింది. అల్పపీడనంతో కురిసిన వర్షానికి తడిసి ముద్దయింది. వరదకు చెరువులు నిండి అలుగులు పారుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని రాంనగర్, శంకర్‌నగర్‌, బ్రహ్మణవీధి, శ్వేతనగర్‌, రామ థియేటర్‌ ప్రాంతాల్లోని వరద నీరు రోడ్లపై ప్రవహించింది. అలాగే లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే జిల్లా కేంద్రానికి నాగర్‌కర్నూల్‌, గద్వాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే రేవెల్లి మండలంలోని కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరింది. చిన్నబావి మండలంలో పలు పంట పొలాలు నీటముగిశాయి. గోపాల్‌పేట పెద్ద చెరువు అలుగుపారడంతో ప్రధాన రహదారిపైకి నీళ్లు చేరడంతో రవాణా స్తంభించింది. పెబ్బేరు మండలం కంచిరావుపల్లి వద్ద చాపలవాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పలు మండలాల్లోనూ వర్షాలు కురిసిన వర్షాలకు చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వీపనగండ్ల మండల కేంద్రం సమీపంలోని బీమా కాలువ ప్యాకేజీ నంబర్‌ 16, డిస్ట్రిబ్యూటర్ 11 కెనాల్ తెగిపోవడంతో పంట పొలాలు నీటమునిగాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో భారీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా గోపాలపేట మండలంలో 145.5 మిల్లీ మీటర్లు, ఘణాపూర్‌లో 126.5, పనగల్‌లో 126.6  మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే జిల్లా కేంద్రంలో 110.8 మిల్లీమీటర్లు, కొత్తకోటలో 93, వీపనగండ్లలో 110 మి.మీటర్లు, అలాగే పలు మండలాల్లోనూ మోసర్తు వాన కురిసింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.