మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 18, 2020 , 16:48:12

పీఎం కేర్స్‌పై లోక్‌స‌భ‌లో దుమారం.. ఠాకూర్ క్ష‌మాప‌ణ‌లకు డిమాండ్‌

పీఎం కేర్స్‌పై లోక్‌స‌భ‌లో దుమారం.. ఠాకూర్ క్ష‌మాప‌ణ‌లకు డిమాండ్‌

హైద‌రాబాద్‌: పీఎం కేర్స్ ఏర్పాటుపై లోక్‌స‌భ‌లో ఇవాళ దుమారం చెల‌రేగింది. విప‌క్ష స‌భ్యులు పీఎం కేర్స్ ఏర్పాటును వ్య‌తిరేకించారు. పన్నులు, ఇత‌ర చ‌ట్టాల స‌డ‌లింపు, స‌వ‌ర‌ణ బిల్లును ఇవాళ కేంద్ర మంత్రి నిర్మిలా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టారు. ఈ నేప‌థ్యంలో స‌భ్యులు త‌మ అభిప్రాయాలు వినిపించారు.  ఎంపీలు శ‌శిథ‌రూర్‌, ఏఎం ఆరిఫ్‌, అధిర్ రంజ‌న్ చౌద‌రీలు బిల్లును వ్య‌తిరేకించారు. ఆర్టిక‌ల్ 266కు వ్య‌తిరేకంగా పీఎం కేర్స్ ఉంద‌ని అధిర్ ఆరోపించారు.  కోవిడ్‌19 నేప‌థ్యంలో ప‌న్నుల చెల్లింపు గ‌డువును పొడిగిస్తూ ట్యాక్సేష‌న్‌ బిల్లును తీసుకువ‌చ్చారు.  పీఎం జాతీయ రిలీఫ్ ఫండ్‌కు ఉన్న మిన‌హాయింపులే పీఎం కేర్స్ ఫండ్‌కు వ‌ర్తిస్తాయని బిల్లులో పేర్కొన్నారు.  ఈ నేప‌థ్యంలో విప‌క్ష స‌భ్యులు బిల్లును వ్య‌తిరేకించారు. కొత్త‌గా నిధిని ఏర్పాటు చేయ‌డానికి కార‌ణం ఏంట‌ని ప్ర‌శ్నించారు.  ఒక‌వేళ పీఎం కేర్స్ ప్ర‌జాద‌న‌మే అయితే, మ‌రి కాగ్ ఎందుకు ఆడిట్ చేయ‌ద‌న్నారు. ఇప్ప‌టికే నేష‌న‌ల్ రిలీఫ్ ఫండ్‌, క్యాన్స‌ర్ ఫండ్‌లు ఉన్నాయ‌ని, ఇప్పుడు కొత్త‌గా పీఎం కేర్స్ ఎందుకు అని, అన్నింటినీ నేష‌న‌ల్ రిలీల్ ఫండ్‌లో క‌లిపేయాల‌ని టీఎంసీ నేత సౌగ‌త్ రాయ్ కోరారు. పీఎం కేర్స్ ఫండ్‌కు క‌ల్పించిన ప్ర‌త్యేక అధికారాల‌ను కాంగ్రెస్ ఎంపీ మ‌నీష్ తివారీ త‌ప్పుప‌ట్టారు. 

మాట‌ల ఘ‌ర్ష‌ణ‌..

పీఎం కేర్స్ నిధి విష‌యంలో బీజేపీ, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య మాట‌ల ఘ‌ర్ష‌ణ కొన‌సాగింది. విప‌క్ష స‌భ్యుల ప్ర‌శ్న‌కు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. విప‌క్ష స‌భ్యుల ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న కొట్టిపారేశారు.  పీఎం కేర్స్‌పై ఉన్న కేసుల‌న్నింటికీ కోర్టులు కొట్టిపారేశాయ‌న్నారు. ఒక‌వైపు కోవిడ్ సంక్షోభం ఏర్ప‌డితే ఏప్రిల్‌లో కోర్టును ఆశ్ర‌యించార‌ని, ఫండ్‌పై ఆర్టీఐ ద‌ర‌ఖాస్తును కూడా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింద‌న్నారు. పీఎం కేర్స్ ఫండ్‌కు వ‌చ్చిన విరాళాలు ప్ర‌భుత్వం ఖాతాలోకి వెళ్ల‌వ‌న్నారు. పీఎంఎన్ఆర్ఎఫ్‌పై థాకూర్ విమ‌ర్శ‌లు చేశారు.  పీఎం ఎన్ఆర్ఎఫ్‌ను క‌నీసం రిజిస్ట‌ర్ కూడా చేయ‌లేద‌న్నారు. ఆ నిధి కేవ‌లం గాంధీ కుటుంబానికే ఉప‌యోగ‌ప‌డింద‌న్నారు. ఈ స‌మ‌యంలో అధిర్ రంజ‌న్ ఆ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. పీఎం కేర్స్ ఫండ్ కోసం చైనా కంపెనీల నుంచి నిధుల‌ను తీసుకున్న‌ట్లు అధిర్ ఆరోపించారు. దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌న్నారు.  నేష‌న‌ల్ రిలీఫ్ ఫండ్‌ను గాంధీ కుటుంబం అక్ర‌మంగా వాడిన‌ట్లు థాకూర్ కౌంట‌ర్ రిప్లే ఇచ్చారు.  ఈ సంద‌ర్భంలో ఠాకూర్ మాట్లాడుతూ పీఎం నేష‌న‌ల్ రిలీఫ్ ఫండ్ వ‌ల్ల ఎవ‌రు బెనిఫిట్ పొందారో బ‌య‌ట‌పెడుతామ‌ని అన్నారు

ఠాకూర్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి..

ఈ సంద‌ర్భంలో విప‌క్ష‌, ప్ర‌భుత్వ స‌భ్యుల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఓ ద‌శ‌లో స్పీక‌ర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని స‌భ్యుల‌ను శాంతింప చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఆ సంద‌ర్భంలో టీఎంసీ ఎంపీ క‌ళ్యాణ్ బెన‌ర్జీ మాట్లాడుతూ బీజేపీ స‌భ్యుల‌ను మీరేమీ అన‌డంలేద‌ని, మీరు మ‌మ్ముల్ని స‌స్పెండ్ చేయ‌వ‌చ్చు అని, కానీ వారిని ర‌క్షించ‌డం స‌రికాదు అన్నారు. . అయితే మంత్రికి కూడా వార్నింగ్ ఇచ్చామ‌ని స్పీక‌ర్ తెలిపారు. అనురాగ్ ఠాకూర్ అంశాన్ని రాజ‌కీయం చేస్తున్నార‌ని అధిర్ రంజ‌న్ అన్నారు. ఒక్కొక్క‌రి గుట్టు బ‌య‌ట‌పెడుతామ‌ని అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని విప‌క్ష స‌భ్యులు డిమాండ్ చేశారు. స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొనడంతో అరగంట సేపు వాయిదా వేశారు. logo