మంగళవారం 26 మే 2020
Telangana - May 22, 2020 , 01:20:29

నిప్పుల కుంపటి

నిప్పుల కుంపటి

  • సూర్యాపేట, ఆసిఫాబాద్‌లో గరిష్ఠంగా 46 డిగ్రీలు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఎండలు సెగలు రేపుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే దంచికొడుతున్నాయి. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా, సూర్యాపేట జిల్లాల్లో అత్యధికంగా 46 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా దొండపాడులో 45.8 డిగ్రీలు, భద్రాది కొత్తగూడం జిల్లా మకరంలో 45.6 డిగ్రీలు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 45 డిగ్రీలుగా రికార్డయ్యాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయి. ఉత్తర ఈశాన్యం వైపునుంచి వీస్తున్న వేడిగాలులు, పొడి వాతావరణం కారణంగా రాగల  మూడ్రోజులు వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో గురువారం వడదెబ్బతో నలుగురు మృతిచెందారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌.ఎస్‌ మండలం పాత సూర్యాపేట గ్రామ శివారు గుట్టల్లో ఐదు నెమళ్లు మృత్యువాతపడ్డాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 42 డిగ్రీలు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎండలు భగ్గుమంటున్నాయి. గురువారం పలుచోట్ల వీచిన వేడిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ఎండాకాలంలో రికార్డుస్థాయిలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలు, గాలిలో తేమ 15 శాతంగా నమోదైందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తరం వైపునుంచి వీస్తున్న వేడిగాలులకుతోడు గాలిలో తేమశాతం తగ్గి గ్రేటర్‌లో ఎండలు మండుతున్నట్టు వెల్లడించారు. మరో వారం రోజుల వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య నమోదై వడగాడ్పులు వీచే అవకాశాలున్నట్టు చెప్పారు.


logo