ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 02:10:49

మనం తినేదంతా పిప్పే!

మనం తినేదంతా పిప్పే!

 • చిరుధాన్యాలు తింటేనే ఆరోగ్య సిరులు
 • ఆరోగ్యానికి, దారుఢ్యానికి సేతువులు
 • తింటున్న అన్నంలో పోషకాలు లేవు
 • నాడు గట్క తాగినోళ్లే గట్టి పిండాలు
 • నేడు నలభై ఏండ్లకే తగ్గిపోతున్న సత్తువ
 • చేతికి పనిలేదు.. శరీరానికి శ్రమ లేదు
 • చిరుధాన్యాల్లోనే ఆరోగ్య సిరులు
 •  ఆరోగ్యానికి, దారుఢ్యానికి సేతువులు

ఈ తరం తింటున్న తిండి ఏమిటి? పాలిష్‌ చేసిన బియ్యం.. రెండు మూడు సార్లు కడిగి వండి వారుస్తాం.. వార్చిన గంజిని సింక్‌లో పారబోస్తాం. పాలిష్‌తో కొంత.. కడుగడంతో మరికొంత.. పారబోసిన గంజితో ఇంకొంత పోషక పదార్థాలు పోయిన తరువాత ఆ పిప్పిని తింటే సత్తువేముంటుంది? పిండి వంటలు కూడా బయటి నుంచి తెచ్చుకొనే పరిస్థితి. వీకెండ్‌లో జంక్‌ఫుడ్‌ తప్పనిసరి. ఫలితం.. కొవ్వు పెరిగి.. రోగనిరోధక శక్తి తగ్గి.. దవాఖానలను పోషించడం అవసరమా?

చిరు ధాన్యాలు.. ఎన్కట తిన్నవే కదా.. గట్క.. జావ తాగిందే కదా.. ఇప్పుడు అలవాట్లు మారడంతో అన్నీ సమస్యలే వస్తున్నాయి. చిరు ధాన్యాలతో అన్ని రకాల పదార్థాలు రుచికరంగా వండుకోవచ్చు. వాటిని తింటే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. శక్తికి శక్తి వస్తుందంటున్నారు నిపుణులు..

ఊళ్లో 75 ఏండ్ల పెద్దమనిషి.. ఈ వయసులోనూ చూపు తగ్గలేదు. పంటి పటువు తగ్గలేదు. శరీరంలో శక్తి తగ్గలేదు. తన పని తాను హాయిగా చేసుకొంటున్నాడు.. సిటీలో 40 ఏండ్ల వ్యక్తి.. కంప్యూటర్‌ ముందు పనిచేసీ చేసీ చత్వారం వచ్చింది. ఎండకు, చలికి తట్టుకోలేడు. బరువైన పనులు చేయలేడు. కనీసం కింద కూర్చొని పైకి లేవాలన్నా కష్టమే. 


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మన చిన్నతనంలో పెద్దోళ్లతో కలిసి చేనుకు వెళ్తే పెసరకాయ, కందికాయ లాంటివి తినేవాళ్లం. మినప పిండి ముద్దలు, గుడాలు, మక్క ప్యాలాల్లాంటివి తిని పోషకాలను శరీరానికి పట్టించుకునేవాళ్లం. కానీ ఇప్పుడు జీవన శైలి మారడంతో హోటళ్లకు ఎగబడుతున్నాం. మసాలాలు దట్టించిన ఆహారాన్ని తినేస్తున్నాం. మరి.. ఆ తిండిలో పోషకాలు ఉంటున్నాయా? శరీరానికి సరిపడా అందుతున్నాయా? అంటే లేదనే చెప్పాలి. మారిన జీవనశైలికి అనుగుణంగా పోషకాల్లేని ఆహారం తీసుకొంటూ ఊబకాయం, మధుమేహం, గుండె సమస్యలు, క్యాన్సర్ల వంటి రోగాల బారిన పడుతున్నాం. రోజూ తినే అన్నంలోనూ పోషకాలు తక్కువే. నిజానికి మనం పాలలా మెరిసే బియ్యాన్నే కొంటాం. ఆ బియ్యాన్ని రెండు, మూడు సార్లు కడిగి, వండేప్పుడు గంజి పారబోస్తాం. ఆ అన్నాన్ని చూసి మంచి తిండే తింటున్నామని అనుకుంటాం. అందులో ఉండే కొన్ని పోషకాలను కూడా మోరి పాలు చేసి పిప్పి తింటున్నాం. 

అందుకే పోషకాలు ఎక్కువగా ఉండే చిరుధాన్యాలను తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఒకప్పుడు పేదోడి తిండి అన్న చిరుధాన్యాలే ఇప్పుడు ఆరోగ్యానికి సిరి ధాన్యాలు అని చెప్తున్నారు. వరి ధాన్యం మాత్రమే తినడం వల్ల ఒంట్లో సత్తువ లేకుండా తయారవుతున్నామని, అన్ని రకాల ధాన్యాలను సమపాళ్లలో తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. సంతులిత ఆహారం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాలను దూరంగా ఉంచొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పింది. పోషకాహారం అందించేందుకు చిరుధాన్యాలు ఉపయోగపడతాయని అంతర్జాతీయ మెట్టపంటల పరిశోధన కేంద్రం ఇక్రిశాట్‌ ఇటీవల ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇచ్చే మధ్యాహ్న భోజనంలోనూ వాటినే అందజేయాలని ప్రభుత్వాలకు సూచించింది. చిరుధాన్యాలను 40శాతం ఉపయోగించి ఆహార ఉత్పత్తులు అందించాలని, తద్వారా సూక్ష్మ పోషకాలు శరీరానికి అందుతాయని స్పష్టం చేసింది. వైవిధ్యభరితమైన ఆహార ధాన్యాల వినియోగం వల్ల శరీరం ధృడంగా తయారవుతుందని పేర్కొంది.

అన్నం తినే వారే ఎక్కువ

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 6వేల వరి రకాలు ఉన్నాయి.  వరి ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. వినియోగం కూడా అదే స్థాయిలో ఉంది. దేశంలో దాదాపు సగం జనాభా వరిని ఆహారంగా తీసుకుంటున్నది. ఉత్తరాదిలో గోధుమ వినియోగం ఎక్కువగానే ఉన్నా దక్షిణాదికి వచ్చేసరికి మాత్రం వరి వినియోగమే ఎక్కువ. మన రాష్ట్రంలోనూ వరి ప్రధాన పంట. దాన్ని మాత్రమే తినడం వల్ల ఇతర ధాన్యాల్లో ఉండే పోషకాలను కోల్పోతున్నాం.

చిరు ధాన్యమే ఆరోగ్యానికి సిరి

పాతతరం వాళ్లు చిరు ధాన్యాన్నే ఎక్కువగా తినేవారు. రాగులు, సజ్జలు, కొర్రలు, అరికెలు, వరిగెలు, సామలు వంటివి తీసుకునేవారు. రోజుకో రకం ధాన్యాలతో సంతులిత ఆహారాన్ని తినేవాళ్లు. తద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అందేవి. చిరు ధాన్యాల్లో కార్బొహైడ్రేట్స్‌తో పాటు ప్రోటీన్లు, పీచు పదార్థం, ఇనుము, కాల్షియం, జింక్‌ వంటి సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. చిరుధాన్యాల్లో ఉండే పొట్టులో మంచి కొవ్వు ఉంటుంది. ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. బియ్యంతో పోల్చితే ఇందులో పీచు ఎక్కువగా ఉండటం వల్ల ఆలస్యంగా జీర్ణమవుతాయి. తద్వారా ఆకలి ఎక్కువగా వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం. మలబద్ధకాన్ని దరిచేరనీయదు. ఇలాంటి అనేక లాభాలు చిరు ధాన్యాల వల్ల ఉన్నాయి. అందుకే కేవలం వరి, గోధుమను మాత్రమే కాకుండా మిగతా ధాన్యాల వైపు దృష్టి మళ్లించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పెరుగుతున్న డిమాండ్‌

ఇటీవల కాలంలో ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవలం అన్నం మాత్రమే ఆహారంగా తీసుకోవటం బదులు చిరు ధాన్యాల వైపు మళ్లుతున్నారు. దవాఖానల బిల్లులు చెల్లించడం బదులు రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. దీంతో పట్టణాల్లో పలు ప్రాంతాల్లో చిరు ధాన్యాల దుకాణాలు పెరిగిపోతున్నాయి. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న చిరు ధాన్యాలను సాగు చేసేందుకు కూడా రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని ఎటువంటి పరిస్థితుల్లోనైనా స్థిరమైన దిగుబడి ఇచ్చే ప్రత్యేకత చిరు ధాన్యాలకు ఉండటంతో లాభసాటిగా భావిస్తున్నారు.

చిరు ధాన్యాల ఉపయోగాలివీ..

 • రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
 • బరువు తగ్గుతారు
 • చర్మం మృదువుగా మారుతుంది
 • మైగ్రేన్‌ తలనొప్పి బాధ ఉండదు
 • క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి
 • ఎముకలు ధృడంగా మారుతాయి
 • మలబద్ధకం సమస్య ఉండదు
 • ఎర్రరక్త కణాలు వృద్ధి చెందుతాయి

 అన్ని ధాన్యాలు ముఖ్యమే 

వ్యాధులతో పోరాడేందుకు, అంటువ్యాధులు రాకుండా ఉండేందుకు జింక్‌, ఐరన్‌, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు అవసరం. అవి అన్నం కంటే చిరుధాన్యాల్లోనే ఎక్కువగా ఉంటాయి. అందుకే అన్నంతో పాటు వాటిని కూడా కచ్చితంగా తీసుకోవాలి. మనిషికి రోజుకు 2వేల కిలో కేలరీలు అవసరం. ప్రతి రోజు తీసుకోవాల్సిన 270 గ్రాముల ధాన్యం నుంచి ఇందులో సగం వరకు రావాలి. అయితే ఎక్కువ శాతం కేలరీలు ఒక్క అన్నం నుంచే శరీరానికి అందుతున్నాయి. దీని బదులు మనం తీసుకునే సగటు 270 గ్రాముల్లో సగం బియ్యం, సగం ఇతర చిరు ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడు సరిపోయేంతగా సూక్ష్మ పోషకాలు శరీరానికి అందుతాయి. మర పట్టిన గోధుమలు, పాలిష్‌ చేసిన బియ్యం తినడం వల్ల సూక్ష్మ పోషకాలు శరీరానికి అందటం లేదు. వారానికి కనీసం ఐదు రోజులైనా ఇలా సగం బియ్యం, సగం చిరు ధాన్యాలు తినడం వల్ల రోగాలు దరి చేరవు.

-డాక్టర్‌ హేమలత, డైరెక్టర్‌, జాతీయ పోషకాహార సంస్థlogo