ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 00:04:57

సైకిల్‌పై సవారీ చేద్దాం

సైకిల్‌పై సవారీ చేద్దాం

  • ‘సైకిల్స్‌ ఫర్‌ చేంజ్‌ చాలెంజ్‌'లో 3 నగరాలు
  • హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌కు స్థానం
  • దేశవ్యాప్తంగా 141 నగరాలు ఎంపిక 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నగరాల్లో వాయు, ధ్వని కాలుష్యాన్ని తగ్గించాలనుకుంటున్నారా? ట్రాఫిక్‌ సమస్యకు మీ వంతుగా చరమగీతం పాడాలనుకుంటున్నారా? అయితే.. సైకిల్‌పై ప్రయాణించండి. దేహదారుఢ్యాన్ని మరింత పెంచుకోవాలనుకుంటున్నారా? సైకిల్‌ తొక్కండి. మీకు సొంతంగా సైకిల్‌ లేదనే ఆలోచన అవసరమేలేదు. ఎందుకంటే మీ చుట్టుపక్కలే మీ కోసం సైకిల్‌ కనిపిస్తుంది. దాన్ని తీసుకుని గమ్యానికి చేరండి. నిర్దేశిత ప్రాంతంలో సైకిల్‌ను వదిలి వెళ్లే వెసులుబాటు కూడా ఉ న్నది. ‘ఇండియా సైకిల్స్‌ ఫర్‌ చేంజ్‌ చాలెంజ్‌' లక్ష్యం ఇదీ. ఇంకెందుకు ఆలస్యం.. చలో ఇక సైకిల్‌పై సవారీ చేసేద్దాం. ఈ చాలెంజ్‌లో రాష్ట్రంలోని హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లు ఎంపికయ్యాయి. నగరాల్లో పెరుగుతున్న వాయు, ధ్వని కాలుష్యాన్ని అరికట్టడం, పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రజల ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపర్చడం, ఖర్చులను తగ్గించడం వంటి లక్ష్యాలతో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ ఇండియా సైకి ల్స్‌ ఫర్‌ చేంజ్‌ చాలెంజ్‌ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా 141 నగరాలు ఎంపికవగా, రాష్ట్రంలోని మూడు నగరాలకు చోటుదక్కింది. కేంద్రం ఈ మూడు నగరాల్లో సొంతంగా సైకిళ్లను వాడటంపై ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నది. ఇందులో పాలుపంచుకునేందుకు ఆయా నగరాల మున్సిపల్‌ కమిషనర్లు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు.

సైకిల్‌ ఫర్‌ చేంజ్‌ చాలెం జ్‌తో  ఆరోగ్యం

శారీరకదారుఢ్యం, మెరుగైన ఆరోగ్య జీవనం అలవర్చుకునేందుకు సైకిల్‌ ఫర్‌ చేంజ్‌ చాలెంజ్‌  కార్యక్రమం ఉపయోగపడుతుంది. సైక్లింగ్‌ వల్ల ధనిక, పేద, వృద్ధులు, పిల్లలు, పురుషులు, మహిళలు అన్న భేదం ఉండదు. నగర వీధులు ట్రాఫిక్‌ సమస్యలేకుండా సురక్షితంగా ఉంటాయి. దాతల ద్వారా సేకరించే సైకిళ్లను మున్సిపల్‌ కార్పొరేషన్లు ప్రజలకు అందుబాటులో ఉంచుతాయి. నగరంలో ఒకచోట తీసుకున్న సైకిల్‌ను మరోచోట నిర్దేశిత ప్రదేశంలో వదిలివెళ్లే అవకాశం ఉన్నది. ప్రజలు సొంతంగా కూడా సైకిళ్లను ఉపయోగించుకోవచ్చు. 

-బోయినపల్లి వినోద్‌కుమార్‌,

 రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు


logo