శుక్రవారం 29 మే 2020
Telangana - Feb 18, 2020 , 02:00:12

విద్యార్థులకు ‘హెల్త్‌ ప్రొఫైల్‌' కార్డులు

విద్యార్థులకు ‘హెల్త్‌ ప్రొఫైల్‌' కార్డులు
  • టీఆర్‌ఎస్‌ నేత రాజశేఖర్‌రెడ్డి వినూత్న కార్యక్రమం
  • ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు అభినందనీయం
  • ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం రోజున టీఆర్‌ఎస్‌ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మేడ్చల్‌లోని 49 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్‌ హెల్త్‌ప్రొఫైల్‌ కార్డులను అందజేశారు. సోమవారం మేడ్చల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, మంత్రి మల్లారెడ్డి విద్యార్థులకు హెల్త్‌ప్రొఫైల్‌ కార్డులను పంపిణీచేశారు. 


ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు, 36 అంశాలపై హెల్త్‌ప్రొఫైల్‌ను రూపొందించి మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమ వివరాలను త్వరలో సీఎం కేసీఆర్‌ను కలిసి వివరిస్తానని చెప్పారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆధునాత సాంకేతికతతో తక్కువ సమయంలోనే ఎక్కువ పరీక్షలను పటిష్ఠంగా చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. 


70 సెకన్లలో 7-8 రకాల వైద్యపరీక్షలు చేసే వీలున్నదన్నారు. మేడ్చల్‌ ప్రభుత్వ పాఠశాల దేశంలోనే ప్రప్రథమంగా డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కలిగిన పాఠశాలగా కీర్తిపొందుతుందని పేర్కొన్నారు. మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్డుద్వారా విద్యార్థి మెడికల్‌ రికార్డును ఒక్కక్లిక్‌తో తెలుసుకునే వీలుంటుందని చెప్పారు. కార్యక్రమంలో మేడ్చల్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, డీఈవో విజయకుమారి, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. 


logo