గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 02:55:47

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి
  • పెరుగుతున్న కొవిడ్‌-19 కేసులు
  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కోరారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు చేపడుతున్న చర్యలపై రోజువారీ సమీక్షలో భాగంగా గురువారం బీఆర్కే భవన్‌లో మంత్రి.. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఏ శాంతికుమారి, ప్రత్యేక అధికారి శ్రీదేవి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీపీహెచ్‌ జీ శ్రీనివాసరావు, ఐపీఎం డైరెక్టర్‌ శంకర్‌తో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. గాంధీ దవాఖానలో కొవిడ్‌-19 పాజిటివ్‌తో చేరిన వ్యక్తికి పూర్తిగా నయమైందని, త్వరలో డిశ్చార్జ్‌ చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం ఒక్క పాజిటివ్‌ కేసు కూడా లేదన్నారు. ఇతర దేశాలనుంచి వచ్చేవారు కచ్చితంగా 14 రోజులు ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉండాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చేవారి ద్వారా మాత్రమే తెలంగాణ గడ్డమీదకు కొవిడ్‌-19 వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు సహకరించాలని కోరారు. సోషల్‌మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఫోన్‌ ద్వారా కోరారు. బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. కాన్ఫరెన్సులు, సెమినార్లను కొద్దిరోజులు వాయిదా వేసుకోవాలన్నారు.


నిట్‌ విద్యార్థికి కరోనా పరీక్షలు

 వరంగల్‌ అర్బన్‌లోని నిట్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థిలో కొవిడ్‌-19 లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో నమూనాలను హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు పంపించారు. ఏపీలోని కర్నూలుకు చెందిన పరిశోధక విద్యార్థి అమెరికాలో జరిగిన జాతీయ సదస్సుకు హాజరై ఈ నెల 1న తిరిగి వచ్చారు. ఆ వెంటనే కర్నూలుకు వెళ్లి ఈ నెల 8న వరంగల్‌ నిట్‌కు చేరుకున్నారు. ఇక్కడికి రాగానే జ్వరం, దగ్గు, జలుబు రావడంతో మంగళవారం హన్మకొండలోని ప్రైవేటు దవాఖానలో చేరారు. కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో గురువారం ఎంజీఎంకు తరలించారు. అక్కడి డాక్టర్లు నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం గాంధీ దవాఖానకు పంపించారు. నిట్‌ క్యాంపస్‌ మెడికల్‌ విభాగం పరిసరాల్లో బ్లీచింగ్‌ చేయడం వంటి చర్యలు చేపట్టారు. నిట్‌లో ఉన్న వారెవరికీ కరోనా వైరస్‌ సోకలేదని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రిజిస్ట్రార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.


కరోనా కట్టడికి చర్యలు

  • హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

 కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కరోనాతోపాటు స్వైన్‌ఫ్లూ, డెంగీ, మలేరియా తదితర వ్యాధుల కట్టడికి చర్యలు తీసుకోవాలని దాఖలైన అన్ని పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోమారు విచారణ చేపట్టింది. మురికివాడల్లో పారిశుద్ధ్య చర్యలు, నీటి సరఫరా చేయాలని హై కోర్టు తెలిపింది. శానిటైజర్లు, మాస్కుల ధరలను పెంచి అమ్ముతున్న మెడికల్‌ షా ప్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనాపై అవగాహన బృందాల ఏర్పాటు, పనివిభజన, ఇతర చర్యల వివరాలు ఇవ్వాలని కోరింది. ఎన్ని ప్రైవేటు దవాఖానల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారన్న వివరాలతో ఈ నెల 23 వరకు రిపోర్ట్‌ ఇవ్వాలని ఆదేశించింది. అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. కరోనా నిర్ధారణ, ప్రజలకు అవగాహన కల్పించేందుకు తీసుకున్న చర్యలను ధర్మాసనానికి వివరించారు. గాంధీ, ఫీవర్‌, వరంగల్‌ ఎంజీఎం, ఉస్మానియా దవాఖానల్లో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో రోజుకు 500 మందికి నిర్ధారణ పరీక్షలు చేసే సామర్థ్యం ఉన్నదని తెలిపారు. కేం ద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 44 కేసులు నమోదయ్యాయని చెప్పారు. కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తీరు బాగున్నదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.


ఇటలీలో తెలుగువారికి కేటీఆర్‌ భరోసా 

  • క్షేమంగా రప్పించాలని విదేశాంగమంత్రికి ట్వీట్‌

 ఇటలీలో చిక్కుకున్న భారత్‌కు చెందిన విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా గురువారం ఉదయం విజ్ఞప్తిచేశారు. ఇటలీ ఎయిర్‌పోర్టులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమకు ఎలాగైనా సహాయం చేయాలని బాధిత విద్యార్థులు చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందించారు. మొత్తం 66 మంది తెలుగు విద్యార్థులు.. అందులో 26 మంది హైదరాబాద్‌వాసులున్నట్టు బాధితులు పేర్కొన్నారు. కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే బోర్డింగ్‌ పాస్‌ ఇస్తామంటూ రోమ్‌ విమానాశ్రయ అధికారులు ఇబ్బందికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్‌.. ‘ఇటలీలోని ఇండియా ఎంబసీ అధికారులను అప్రమత్తం చేసి, దిక్కు తోచని స్థితిలో ఉన్న విద్యార్థులకు సహాయం చేయాలి’ అని కేంద్ర మంత్రికి ట్వీట్‌చేశారు.


మూడు కిలోల కోడి రూ.50కే! 

జవహర్‌నగర్‌: కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తుండగా వ్యాధిభయం తో జనం కోడి మాంసం తినడం తగ్గించారు. దీంతో చికెన్‌ విక్రయా లు అమాంతం పడిపోయాయి. ఫౌల్ట్రీఫాం నిర్వాహకులు  నష్టాన్ని కొంతవరకైనా పూడ్చుకొనేందుకు ఇండ్లవద్దకే వచ్చి రూ.50కే మూడుకిలోల కోడిని విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌ జవహర్‌నగర్‌లోని అంబేద్కర్‌నగర్‌లో గురువారం గూడ్స్‌ ఆటోలో కోళ్లను తీసుకువచ్చి విక్రయించగా, స్థానికులు పెద్దఎత్తున కొనుగోలుచేశారు. 


logo