శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 02:36:41

ఆ ఇద్దరికి కరోనా లేదు

ఆ ఇద్దరికి కరోనా లేదు
  • ఆరోగ్యంగానే తెలంగాణ స్థానికులు
  • దుబాయ్‌ నుంచి వచ్చిన ఒక్కరికే వైరస్‌
  • త్వరలోనే డిశ్చార్జి
  • వ్యాధిలక్షణాలుంటేనే వైద్య పరీక్షల నిర్వహణ
  • మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా పరీక్షలు నిర్వహించిన ఇద్దరు అనుమానితులకు వ్యాధి లేదని నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. అనుమానిత లక్షణాలున్న అపోలోలోని శానిటరీ వర్కర్‌, ఇటలీ వెళ్లి వచ్చిన మైండ్‌స్పేస్‌లోని డీఎస్‌ఎం ఉద్యోగినికి చెందిన నివేదికలను కేంద్ర ఆరోగ్యసంస్థ వెల్లడించిందని,, వారిద్దరికీ కొవిడ్‌-19 సోకలేదని స్పష్టంచేశారు. గురువారం కోఠిలోని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఒక్కరికి కూడా కొవిడ్‌-19 సోకలేదని పునరుద్ఘాటించారు. 


గాంధీలో చికిత్స పొందుతున్న వ్యక్తికి దుబాయ్‌లో అంటుకొన్నదని, ఆ వ్యక్తి కూడా త్వరలోనే డిశ్చార్జి అవుతాడని తెలిపారు. కొవిడ్‌-19 గాలిద్వారా వ్యాప్తిచెందదని, ఎవరూ ఆందోళన చెందనక్కరలేదని చెప్పారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదన్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తి మినహా రాష్ట్రంలో మరెవరికీ ఈ వైరస్‌ సోకలేదని పేర్కొన్నా రు. కరోనాపై ఎవరూ అతిగా స్పందించవద్దని.. వైరస్‌ సోకిందంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కార్యాలయాన్ని ఖాళీచేయడం సరికాదని ఈటల చెప్పారు. ఐటీ కంపెనీలు బాధ్యతగా మెలగాలని.. నెగెటివ్‌ ప్రచారం వల్ల బాధ కలుగుతున్నదన్నారు. వైరస్‌ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామన్నారు. ప్రభుత్వం తీసుకొన్న చర్యలను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించిందని చెప్పారు. కరోనాపై ప్రజలకు అవగాహన  కల్పించడంలో మీడియా సహకరించిందని తెలిపారు. 


వైరస్‌ లక్షణాలుంటేనే పరీక్షలు

కొందరు వ్యక్తులు అనవసర భయంతో జలు బు, దగ్గు ఉన్నదంటూ పరీక్షలకోసం గాంధీ దవాఖానకు వస్తున్నారని, వైరస్‌ లక్షణాలున్నవారికి మాత్రమే నిర్ధారణ పరీక్షలుచేస్తామని మంత్రి ఈటల స్పష్టంచేశారు. అర్జెంటీనా నుంచి హైదరాబాద్‌ వచ్చిన కొందరు కొవిడ్‌ -19 పరీక్షలకు విజ్ఞప్తిచేశారని, మరికొందరు ఫోన్‌చేసి అడుగుతున్నారని చెప్పారు. ఇన్‌ఫెక్షన్‌ లేనివారికి ఆ పరీక్షలుచేయడం కుదరదన్నారు. అనుమానం ఉంటే.. డబ్బులు ఉంటే చేసే పరీక్షలు ఇవి కావని తెలిపారు. ఐసొలేషన్‌ వార్డు లు దవాఖానల్లోనే కాకుండా ఇండ్లల్లోనూ పెట్టుకోవచ్చని.. ఆ సదుపాయం లేని సందర్భంలోనే దవాఖానకు తరలించాలని చెప్పా రు. కొవిడ్‌-19 నిరోధానికి ఏర్పాటుచేసిన కమిటీలు నిరంతరం పనిచేస్తాయని చెప్పారు. సమావేశంలో డీఎంఈ, టీవీవీపీ కమిషనర్‌ కే రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ జీ శ్రీనివాసరావు, ఐపీఎం డైరెక్టర్‌ శంకర్‌ పాల్గొన్నారు. 


అపోహలు తిప్పికొట్టాలి

కొవిడ్‌-19 వ్యాప్తిపై ప్రజల్లో నెలకొన్న భయా లు, అపోహలు తిప్పికొట్టాల్సిన బాధ్యత మ నందరిపై ఉన్నదని ఈటల పేర్కొన్నారు. కరోనావ్యాప్తిని నియంత్రించేందుకు ఏర్పాటైన కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ సమావేశ మందిరంలో సర్వేలెన్స్‌ వైద్యసిబ్బందితో సమావేశమయ్యారు. సర్వేలెన్స్‌ సేవలకోసం 200 మంది మెరికల్లాంటి వైద్య సిబ్బందిని ఎంపికచేసి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. కొవిడ్‌-19 నియంత్రణకు కృషిచేయడానికి జి ల్లాలనుంచి వచ్చిన అధికారులు, వైద్యసిబ్బందిని అభినందించిన మంత్రి.. విపత్కర పరిస్థితుల్లో పనిచేసిన సిబ్బందికి అదనపు వేతనంతోపాటు సర్టిఫికెట్‌ ఇవ్వాలని ఆదేశించారు. 


ప్రజల భయంతో ఆటలాడొద్దు

కొవిడ్‌-19 విస్తరిస్తుందన్న ఆలోచనతో ప్రజ లు విపరీతంగా మాస్కులు కొంటున్నారని, వారి భయాన్ని సొమ్ముచేసుకోవాలని ప్రయత్నించడం సరికాదని ఈటల అన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు.. వారి సమీపంలో ఉన్నవారు మాత్రమే మాస్క్‌ ధరించాలని.. ఇతరులకు అక్కర్లేదని చెప్పారు. ప్రజల భయంతో వ్యాపారంచేస్తే సహించబోమని, అధికధరలకు మాస్కులను అమ్మే మందుల షాపులను శాఖాపరంగా తనిఖీచేయించి చర్యలు తీసుకుంటామని ఈటల హెచ్చరించారు. 


ప్రైవేటు యాజమాన్యాలతో భేటీ

కొవిడ్‌-19 తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేకచర్యల దృష్ట్యా ఐసొలేషన్‌ సేవలు అందించేందుకు ప్రైవేటు దవాఖానల యాజమాన్యాలతో ఈటల సమావేశమయ్యారు. ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చకముందే ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇందుకు ప్రైవేటు దవాఖానలు అంగీకరించాయి. కొవి డ్‌-19 వైరస్‌ అనుమానిత లక్షణాలున్న వారి కి పరీక్షలు నిర్వహించి శాంపిళ్లను గాంధీ దవాఖానకు పంపాలని  సూచించారు. అనుమానితుల నుంచి శాంపిళ్ల సేకరణ, వైద్య చికిత్స వంటివి ప్రొటోకాల్‌ ప్రకారమే జరుగాలన్నా రు. వైద్య చికిత్స విధానం, ఐసొలేషన్‌ వార్డు ల్లో ఉంచాల్సిన పరికరాలు, చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం నిర్ణయిస్తుందని.. నిబంధనలకు లోబడే చికిత్సలు అందించాలని కోరారు. వైరస్‌ పట్ల వైద్యులు, సిబ్బందికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.


హోమియో మందుల పంపిణీ

రామంతాపూర్‌: కొవిడ్‌-19 వైరస్‌పై ఆందోళనవద్దని, ప్రభుత్వం అన్నివిధాలుగా చర్య లు తీసుకొంటున్నదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల తెలిపారు. గురువారం రామంతాపూర్‌లోని ప్రభుత్వం హోమియో వైద్యశాలలో కరోనా ప్రివెంటివ్‌ మందులను మంత్రి పంపిణీచేశారు. అనంతరం మాట్లాడుతూ.. మన ఉష్ణోగ్రతలకు, కరో నా వైరస్‌ బతుకదని.. అనుకోని పరిస్థితుల్లో వ్యాప్తిచెందితే గట్టి చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ప్రజలుకూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. హోమియో వైద్యాన్ని నమ్మేవారు చాలామంది ఉన్నారన్నారు. రెండుకోట్ల మందికి సరిపడా మందులకోసం నిధులు ఇస్తామని పేర్కొన్నారు. హోమియోపతి రోగనిరోధకశక్తిని పెంచుతుందన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొవిడ్‌-19 నిరోధానికి ఇప్పటివరకు 30 వేలమందికి కరోనా మందు ఆర్సెనిక్‌ ఆల్బం మాత్రలను పంపిణీచేసినట్టు ప్రభుత్వ హోమియో వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లింగరాజు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


హైకోర్టులో హోమియోపిల్స్‌ పంపిణీ

హైకోర్టు బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదులకు రోగనిరోధక శక్తిని పెంపొందించే హోమియో పిల్స్‌ను పంపిణీ చేశా రు. చీఫ్‌జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ న్యాయవాదులకు మందులు అందజేశారు.


logo