గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 03, 2020 , 02:28:13

నిమ్స్‌లో స్టెమ్‌సెల్‌ విభాగం

నిమ్స్‌లో స్టెమ్‌సెల్‌ విభాగం

  • స్టెమ్‌సెల్‌ బ్లడ్‌ క్యాన్సర్‌ రోగులకు ఉపయోగం
  • ప్రారంభించిన వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ 
  • 200 కోట్లతో దవాఖానను విస్తరిస్తామని వెల్లడి

శ్రీనగర్‌కాలనీ: నిమ్స్‌ దవాఖాన ప్రాంగణంలో రూ.20 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన స్టెమ్‌ సెల్‌ విభాగం, మాలిక్యులర్‌ ల్యాబ్‌, ఐసీయూ అందుబాటులోకి వచ్చాయి. మాలిక్యులర్‌ ల్యాబ్‌ ఢిల్లీ తర్వాత హైదరాబాద్‌లోనే ఏర్పాటుచేయడం విశేషం. వీటిని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన ల్యాబ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమ్స్‌ దవాఖానలో అత్యుత్తమ ప్రమాణాలతో వైద్యసేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలోనే నిమ్స్‌ను అత్యుత్తమ దవాఖానగా తీర్చిదిద్దడంతోపాటు సామర్థ్యం పెంచే ప్రతిపాదనలు చేశామని చెప్పారు. ఢిల్లీలో మాత్రమే ఉన్న మలిక్యూలర్‌ ల్యాబ్‌ను నిమ్స్‌లో ఏర్పాటుచేయడంతో స్టెమ్‌సెల్‌ బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడే పేదలకు ఎంతో మేలు కలుగుతుందని వివరించారు. బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడే పేదలకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యసేవలు అందిస్తామని చెప్పారు. దేశంలోనే ఉన్నత ప్రమాణాలతో ఇక్కడ ల్యాబ్‌ను ఏర్పాటుచేశామన్నారు. ఈ ల్యాబ్‌లో నిత్యం 10 వేల శాంపిళ్లను టెస్టుచేసే వీలుందని, ప్రసుత్తం 10 పడకల ఐసీయూ ఈ విభాగంలో ఏర్పాటుచేశామని తెలిపారు. రూ.200 కోట్లతో నిమ్స్‌ను విస్తరించే ప్రతిపాదన ఉన్నదని మంత్రి చెప్పారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో సాధారణ వైద్యసేవలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఐసీఎమ్మార్‌ సూచనలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిందని పేర్కొన్నారు. గతంలో వైరల్‌ ఇన్ఫెక్షన్‌ ఎలా ఉండేదో కరోనాతో ప్రజలు అదే విధంగా సహజీవనంచేయాల్సి ఉంటుందన్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ తరహాలోనే నగర శివార్లలో బీబీనగర్‌లో ఎయిమ్స్‌, గచ్చిబౌలిలో టిమ్స్‌ ఉన్నాయని, త్వరలోనే శామీర్‌పేట, కొంగరకలాన్‌ ప్రాంతాల్లో దవాఖానలు వచ్చే వీలున్నదని వివరించారు. ఖైరతాబాద్‌లోని ఈహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ కేంద్రాన్ని నిమ్స్‌ ప్రాంగణానికి మార్చనున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో నిమ్స్‌కు వచ్చే బాధితులకు ప్రథమ చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో నిమ్స్‌ డైరెక్టర్‌ కందగట్ల మనోహర్‌, సూపరింటెండెంట్‌ సత్యనారాయణ, వైద్యులు పాల్గొన్నారు.logo