మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:32:07

తప్పుడు ప్రచారాలు తగవు

తప్పుడు ప్రచారాలు తగవు

  • వాటితో కరోనా వైరస్‌పై పోరుకు ఆటంకం
  • తగినన్ని పీపీఈ కిట్లు, ఎన్‌ 95 మాస్కులు
  • వైద్యసిబ్బందిని కాపాడుకునేలా చర్యలు
  • రాష్ట్రంలో ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాల అమలు
  • వైద్యులకు వారం విడిచి వారం విధులు
  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పీపీఈ కిట్లు, ఎన్‌- 95 మాస్కులు లేనందువల్లే వైద్యులు, సిబ్బందికి కరోనా సోకిందంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారన్న విమర్శల్లో నిజం లేదన్నారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవ పరిస్థితులను గుర్తించి మాట్లాడాలని సూచించారు. శుక్రవారం కోఠిలోని కరోనా కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతోపాటు మెటర్నిటీ, నిమ్స్‌ వైద్యులతో సమీక్ష నిర్వహించారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్వారంటైన్‌ కేంద్రాల్లో సరైన వసతులు లేవని కొందరుచేస్తున్న అనవసర ఆరోపణలు వైరస్‌పై పోరుకు ఆటంకంగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఆరోపణల్లో నిజం ఉంటే వాస్తవాలను బయట పెట్టాలని, ప్రజల పట్ల ప్రేమ ఉంటే సరైన సూచనలు చేయాలని హితవుపలికారు. అమెరికా లాంటి దేశంలో మూడు శాతం వైద్యులకు కరోనా సోకిందని, రాష్ట్రంలోని వైద్యులు, ఇతర సిబ్బంది పట్ల ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇందుకోసం కిందిస్థాయిలోని వైద్య సిబ్బందికి, పోలీసులకు, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి హెచ్‌సీక్యూ మందులు నిర్ణీత డోసుల్లో వేసుకొనేలా పంపిణీ చేశామన్నారు. 

కొన్ని శస్త్ర చికిత్సలను వాయిదా వేయొచ్చు కానీ, డెలివరీలు వాయిదా వేయలేమని.. ఈ పరిస్థితిలో కరోనా చికిత్స అందించే వారే కాకుండా ప్రసవాలు చేసే వైద్యులు సైతం ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారని తెలిపారు. కరోనా సోకిన వైద్యులు, ఇతర సిబ్బందికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నామన్నారు. పాజిటివ్‌ ఉన్నా కొందరు వైద్యులు ప్రస్తుత సమయంలో పనిచేయడం తమ బాధ్యత అంటూ ముందుకు వస్తున్నారని, అటువంటివారిని ప్రోత్సహించడం అవసరమన్నారు. వైద్యులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు పలు దవాఖానలకు సంబంధించిన డాక్టర్లు, ఇతర సిబ్బందికి వారం రోజులు విధులు.. ఆ తర్వాత వారం రోజులు విరామం ఇచ్చేలా ఏర్పాటుచేశామన్నారు. ప్రస్తుతం 10 లక్షలకుపైగా పీపీఈ కిట్లు, 11 లక్షలు ఎన్‌- 95 మాస్కులు, 84 లక్షలు హెచ్‌సీక్యూ మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 3 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌, టెక్నికల్‌ సిబ్బందిని అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్‌ అనుమతించారని, నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. గాంధీ వైద్యుల సేవలు, కృషిని అందరూ అభినందించాలని కోరారు. కరోనా దవాఖానల్లో రెండంచెల విధానాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. గాంధీ, నిలోఫర్‌, పేట్లబురుజు, సుల్తాన్‌బజార్‌ దవాఖానల్లో అన్ని వసతులు కల్పించామని చెప్పారు. ఐసొలేషన్‌ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

ప్రైవేట్‌లో పరీక్షలకు అనుమతివ్వలేం

కరోనా నిర్ధారణ పరీక్షలకు ప్రైవేట్‌కు అనుమతి ఇవ్వడంతో దేశంలోని ఇతర రాష్ర్టాల్లో దుష్పరిణామాలు చోటుచేసుకున్నాయని, ఇటువంటి పరిస్థితిలో తెలంగాణలో అనుమతివ్వలేదని మంత్రి ఈటల స్పష్టంచేశారు. కరోనా పరీక్షలు అన్ని వ్యాధుల్లాగా చేసేది కాదన్నారు. ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాల మేరకు లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. అనుమానిత లక్షణాలున్నవారు ముందుగా దవాఖానలో చేరాలని, వైద్యులు నిర్ధారిస్తేనే పరీక్షలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. పాజిటివ్‌ వస్తే వైద్యసేవలు అందించడంతోపాటు అతని కాంటాక్ట్‌లను గుర్తించాల్సి ఉంటుందన్నారు. 

ఈ పరిస్థితిలో ప్రైవేట్‌కు అనుమతిస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. పాజిటివ్‌ కేసుల్లో వైరస్‌ లక్షణాలు లేకుంటే ఇంట్లోనే ఉంచి ఐసొలేషన్‌ సేవలు అందిస్తున్నామని, నేచర్‌ క్యూర్‌, ఇతర దవాఖానల్లో కూడా కరోనా లక్షణాలు లేని పాజిటివ్‌ వ్యక్తులకు సేవలందించేందుకు ఏర్పాట్లుచేశామని వివరించారు. లాక్‌డౌన్‌లో సడలింపులతో ఇతర దేశాల నుంచి భారతీయులు వస్తున్నారని, అక్కడ జైళ్లలో ఉన్నవారిని కేంద్రం విమానాల ద్వారా నేరుగా ఇక్కడికి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతున్నదన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి కూడా ఇక్కడికి తీసుకొస్తున్నామని, అలాంటివారిలో హైరిస్క్‌ కాంటాక్ట్‌ ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వారిలో ఇప్పటివరకు 200కు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలిపారు. గ్రామాలు, ఇతర పట్టణాలకు కూడా దేశవిదేశాల నుంచి అధిక సంఖ్యలో వస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని పీహెచ్‌సీ, సబ్‌ సెంటర్‌స్థాయిలో జలుబు, జ్వరం ఉన్నవారికి పరీక్షలు చేస్తున్నామని వివరించారు.


logo