శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 19:23:22

కొత్త రకం వైరస్‌తో ఆందోళన చెందొద్దు: శ్రీనివాసరావు

కొత్త రకం వైరస్‌తో ఆందోళన చెందొద్దు: శ్రీనివాసరావు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది.  కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ వ్యాప్తి చెందకుండా ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌ విధానం అవలంభిస్తున్నామని డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు.  యూకే నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని చెప్పారు.  కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వ చర్యలు, ప్రజల సహకారం వల్లే కరోనా వైరస్‌ వ్యాప్తి, మరణాల సంఖ్యను అదుపులో ఉంచగలిగామని వివరించారు.  మున్ముందు కూడా ప్రజలు సహకరించాలని కోరారు. 

బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి ఈనెల 9 నుంచి ఇప్పటి వరకు 1200 మంది వచ్చారు.  యూకే నుంచి వచ్చిన వారిలో 926 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించాం. ఇప్పటి వరకు ఫలితాలు వచ్చిన వారిలో 16 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారించాం.  కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో హైదరాబాద్‌ నుంచి నలుగురు, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా నుంచి నలుగురు, జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లా నుంచి ఒక్కొక్కరు పాజిటివ్‌ ఉన్నట్లు తేలిందన్నారు. 

16 మందిని వివిధ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో ఉంచాం. 16 మందికి అతిసన్నిహితంగా ఉన్న మరో 76 మందిని కూడా గుర్తించాం.  16 మందిలో ఉన్న వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్స్‌ తెలుసుకునేందుకు శాంపిల్స్‌ని సీసీఎంబీకి పంపించాం.  డిసెంబర్‌ 9 తర్వాత రాష్ట్రానికి నేరుగా  యూకే నుంచి వచ్చిన వారు, యూకే మీదుగా ప్రయాణం చేసి వచ్చిన వారు 040-24651119 నంబర్‌కు ఫోన్‌ చేసి‌, 9154170960 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా  తెలియజేయాలి.  వివరాలు ఇచ్చిన వారి ఇంటికే వెళ్లి ఆరోగ్య సిబ్బంది వైద్య పరీక్షలు చేస్తారని శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. logo