బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 01:30:45

పల్లె ముంగిట్లోకి ప్రతిమ వైద్యం

పల్లె ముంగిట్లోకి ప్రతిమ వైద్యం

 • సరికొత్త విధానాలకు ప్రతిమ ఫౌండేషన్‌ శ్రీకారం 
 • అధునాతన సౌకర్యాలతో ‘సంచార ఆరోగ్య రథం”
 • 200 గ్రామాల్లో ‘ఆరోగ్య ప్రతిమ’ క్లినిక్‌లు

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తేతెలంగాణ: వైద్యం కోసం గ్రామీణులు పడుతున్న అవస్థలు దూరం చేసేందుకు ప్రతిమ ఫౌండేషన్‌ శ్రీకారం చుట్టింది. అధునాతన సౌకర్యాలతో కూడిన ప్రతిమ సంచార ఆరోగ్య రథాలను అందుబాటులోకి తెచ్చి పల్లెల్లోనే రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నది. ఉత్తర తెలంగాణలోని 200 గ్రామాల్లో ‘ఆరోగ్య ప్రతిమ గ్రామీణ క్లినిక్‌'లను ఏర్పాటు చేస్తున్నది. ప్రతిమ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కరీంనగర్‌ సహకారంతో ప్రతిమ ఫౌండేషన్‌ ఈ సేవలను అందిస్తున్నది. వీటిని ఈ నెల 8న మంత్రి కేటీఆర్‌ కరీంనగర్‌లో ప్రారంభించారు. ఇదిలా ఉండగా సామాజికసేవలో ముందున్న ప్రతిమ ఫౌండేషన్‌ కరోనా కట్టడి కోసం అన్నదాతలకు కోటిమాస్కుల పంపిణీని విజయవంతంగా కొనసాగిస్తున్నది.  

పల్లెలకు ‘ప్రతిమ సంచార ఆరోగ్య రథం’

వ్యాధి ఏదైనా దాని నిర్ధారణే కీలకం. ఇందుకోసం పల్లె ప్రజలు వ్యయప్రయాసాలకోర్చి పట్టణాలకు పరుగులు తీయాల్సిందే. ఈ ఇబ్బందులను దూరం చేసేందుకు ప్రతిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కరీంనగర్‌ సహకారంతో ప్రతిమ ఫౌండేషన్‌ ‘ప్రతిమ సంచార ఆరోగ్య రథం’ ప్రారంభించింది. ఈ రథం నేరుగా గ్రామంలోకి వెళ్లి ఉచితంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తుంది. 

200 ఊర్లలో ‘ఆరోగ్య ప్రతిమ గ్రామీణ క్లినిక్‌'ల సేవలు

ఉత్తర తెలంగాణలోని 200 గ్రామాల్లో “ఆరోగ్య ప్రతిమ గ్రామీణ క్లినిక్‌”లు ఏర్పాటు చేస్తున్నది. ఇందుకోసం సాంకేతిక పరిజానాన్ని వినియోగిస్తున్నది. రోగులు సొంత గ్రామం నుంచే సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు పొందేలా ఆన్‌లైన్‌ వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి, కరీంనగర్‌ జిల్లా వీణవంక మండల గన్ముకుల, కొత్తపల్లి మండలం బాహుపేట, పెదపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో వీటిని ఏర్పాటు చేశారు.

ఆన్‌లైన్‌లో వైద్యసేవలు 

 • ప్రతి క్లినిక్‌లో వెబ్‌ కెమెరాలు, 32 ఇంచుల ఎల్‌ఈడీ టీవీ, ఆన్‌లైన్‌ సేవల కోసం నెట్‌ సౌకర్యం కల్పిస్తారు.
 • క్లినిక్‌ పరిధిలో వైద్యం తెలిసిన విలేజ్‌ హెల్త్‌ కో అర్డినేటర్‌ను సంస్థ నియమిస్తారు. వారు రోగుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతోపాటు ఏ వైద్యుడి సహాయం అవసరమో పేర్కొంటూ ప్రతిమ ఫౌండేషన్‌కు సమాచారం ఇస్తారు. 
 • ఈ మేరకు.. సదరు వైద్యుడు వీడియో ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చి రోగితో మాట్లాడి మందులను వివరిస్తారు. అక్కడే ఉన్న విలేజ్‌ కో-ఆర్డినేటర్‌ మందుల చీటీ రాసివ్వడంతోపాటు ఎలా వాడాలో రోగికి సూచిస్తారు.  

అదో మినీ వైద్యశాల 

 • ఎక్స్‌-రే, ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌, హోల్టర్‌ మానిటరింగ్‌, అల్ట్రాసౌండ్‌, థ్రెడ్‌ మిల్‌ టెస్ట్‌, మామోగ్రఫీ మినీ లాబొరేటరీ తదితర అధునాతన పరికరాలు అమర్చారు. 
 • వివిధ రకాల వైద్యులు, ల్యాబ్‌టెక్నిషియన్స్‌, ఇతర మెడికల్‌ స్టాఫ్‌ కలిపి 20 మంది బృందం ఈ రథంలో ఉండి సేవలందిస్తుంది. 
 • ప్రతిమ ఫౌండేషన్‌ హెల్త్‌ కో-ఆర్డినేటర్లు  గ్రామాల్లోని సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను కలిసి హెల్త్‌క్యాంపులు నిర్వహిస్తారు. 
 • బీపీ, షుగర్‌, గుండెవ్యాధులు, క్యాన్సర్‌, ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని గుర్తించి ఉచితంగా పరీక్షలు చేసి వైద్యసేవలందిస్తారు. 
 • ఒక్కో వైద్య శిబిరం నిర్వహణకు రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. 


logo