శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 01:59:25

ప్రతి ఒక్కరికీ వైద్యం

ప్రతి ఒక్కరికీ వైద్యం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వర్షాల నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదని, నివారణకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని వైద్యారోగ్యశాఖ కృషిచేయాలని మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల లక్షణాలు, కరోనా లక్షణాలు ఒకేలా ఉన్న నేపథ్యంలో నిర్లక్ష్యంచేయకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. కాచి వడపోసిన నీటిని తాగడం, పరిశుభ్రంగా ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. సీజనల్‌ వ్యాధులపై డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డిలతో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. సీజనల్‌ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వైద్యసేవలు అందేలా చూడాలని చెప్పారు. ఇప్పటికే చేపట్టిన చర్యలను వైద్యాధికారులు మంత్రికి వివరించారు. జీహెచ్‌ఎంసీలో 24 గంటలపాటు మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లోని ఆశా వర్కర్లను అప్రమత్తంచేశామన్నారు.