సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 03:16:05

పైవేట్‌ హాస్పిటల్స్‌ చట్టానికి అతీతమా?

పైవేట్‌ హాస్పిటల్స్‌ చట్టానికి అతీతమా?

  • మాట వినకుంటే చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రైవేటు హాస్పిటల్స్‌ చట్టానికి అతీతమా? లేక వాటికేమైనా ప్రత్యేక రక్షణలు ఉన్నాయా? అని హైకోర్టు ప్రశ్నించింది. మాట వినని ప్రైవేటు దవాఖానలపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించింది. కొవిడ్‌-19 చికిత్స, పరీక్షలపై దాఖలైన అన్ని పిటిషన్లపై శుక్రవారం చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ భూములు, ఇతర ప్రయోజనాలు పొంది ఒప్పందం ప్రకారం పేదలకు ఉచిత చికిత్స అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ ప్రయోజనాలు పొందిన హాస్పిటల్స్‌లో ఎంతమందికి చికిత్స చేశారో చెప్పాలని వైద్య ఆరోగ్యశాఖను ప్రశ్నించింది. చికిత్స చేయని దవాఖానలపై ఏ చర్యలు తీసుకున్నారో తెలుపాలని ఆదేశించింది. అధిక బిల్లులపై జాతీయ ఔషధ ధరల నియంత్రణ అథారిటీ (ఎన్‌పీపీఏ) విచారణ చేపట్టి నివేదికను కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌కు అందజేయాలని సూచించింది. ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈనెల 22లోగా నివేదించాలని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌కు హైకోర్టు తెలిపింది. కేసు విచారణను 24వ తేదీకి వాయిదావేసింది


logo