శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 00:43:38

విద్వేషమే ఎజెండా

విద్వేషమే ఎజెండా

  • మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ వ్యాఖ్యలు
  • వ్యక్తిగత దూషణలు, కాంట్రవర్సీ మాటలు 
  • అబ్జర్వ్‌ చేస్తున్నామంటున్న ఎన్నికల కమిషన్‌

‘పాతబస్తీ మీద సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తాం.. రోహింగ్యాలను తరిమికొడతాం.. తలచుకుంటే రెండు గంటల్లో దారుస్సలాం కూల్చేస్తాం.. హిందూ సమాజం కోసం బరాబర్‌ కొట్లాడుతాం’ 

-  ఎంపీ బండి సంజయ్‌ కామెంట్స్‌

‘టీఆర్‌ఎస్‌కు మజ్లిస్‌ సపోర్ట్‌ ఉండబట్టే హైదరాబాద్‌లో హిందూ, ముస్లిం గొడవలు జరుగడం లేదు. ఎంఐఎం సపోర్ట్‌ చేస్తున్నందుకే బాంబ్‌ బ్లాస్ట్‌లు అవుతలేవు’ 

- వీడియోలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

‘పిల్లర్లు, టాయిలెట్లు, బస్టాండ్లలో ఇగిలిచ్చుకుంట బొమ్మలు పెట్టుకుంటరా.. ఎక్కడున్నా టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలను పీకేయండి’ 

- అనుమతులు తీసుకొని ఏర్పాటుచేసిన టీఆర్‌ఎస్‌ ప్లెక్సీలను 

పీకేయాలంటూ పిలుపునిచ్చిన బీజేపీ ఎంపీ అర్వింద్‌  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని బీజేపీ నాయకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడే రోడ్‌షోలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజల మధ్య విద్వేషాలను పాదుకొల్పుతున్నారు. ఎక్కడ మాట్లాడినా హిందూ, ముస్లిం సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీయడమే తమ ఎజెండా అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నోటిఫికేషన్‌ వచ్చిననాటి నుంచి బీజేపీ నేతలు ఎవరేం మాట్లాడి నా.. మత సంబంధ వ్యాఖ్యలే ఉంటున్నాయి. ఎంపీ అర్వింద్‌ ఒక్క అడుగు ముందుకేసి మరీ.. టీఆర్‌ఎస్‌ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలను పీకేయండంటూ రెచ్చగొడుతున్నారు. ఫ్లెక్సీని తొలిగిస్తున్న వీడియోను కూడా తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌చేశారు. ఇక ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాటలు.. మతకలహాలు ఖాయం అనేట్టు ఉంటున్నాయి. బాంబు దాడులు, హిందూ-ముస్లింల మధ్య గొడవలు జరుగడం లేదంటూ వీడియోల్లో రెచ్చగొడుతున్నారు. ఇవన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని తెలిసినా.. బీజేపీ నేతలు తమ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను ఆపడంలేదు. పెచ్చుమీరుతున్న బీజేపీ నేతల ఆగడాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

నియమావళి చెప్పేది ఇదే.. 

పార్టీ, అభ్యర్థి ప్రస్తుతం నెలకొన్న విభేదాలను తీవ్రతరం చేయ డం, పరస్పర ద్వేషభావాన్ని సృష్టించడం, కులం, మతం, భాష ల మధ్య విభేదాలను సృష్టించే కార్యకలాపాలలో పాల్గొనొద్దు.

జాతి, మతం, కులం, ప్రాంతం ప్రాతిపదికగా ఓటు కోరవద్దు.

దేవాలయాలు, మసీదులు, చర్చిలను ఎన్నికల ప్రచారానికి వేదికలుగా వాడుకోవద్దు.

అభ్యర్థి లేదా పార్టీల ప్రజాజీవితానికి సంబంధం లేని వ్యక్తిగత విషయాలను, వాస్తవాలను రూఢీ చేసుకోకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు.

ఒక రాజకీయ పార్టీపై విమర్శలు చేసేటప్పుడు అవి పార్టీ విధానాలు, కార్యక్రమాలు, గత చరిత్రలకు కట్టుబడి ఉండాలి. అంతేగాని వాస్తవాలకు దూరంగా నిరాధార ఆరోపణలు చేయవద్దు.


అన్నీ గమనిస్తున్నాం.. చర్యలు తీసుకుంటాం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రతి పార్టీని ఎన్నికల పరిశీలకులు అబ్జర్వ్‌ చేస్తున్నారు. ఎక్కడైనా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినట్లు గుర్తిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. చట్టప్రకారం ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటాం. 

- పార్థసారథి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌


logo