ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 01:28:10

పల్లెల్లో దీక్షగా హరితహారం

పల్లెల్లో దీక్షగా హరితహారం

  • పల్లెల్లో దీక్షగా హరితహారం
  • ఐదేండ్లలో 40.79 కోట్ల్ల మొక్కలు  
  • ఈసారి గ్రామ పంచాయతీల్లోనే 12.74 కోట్లు  
  • గతేడాది నాటిన వాటిలో 91 శాతం మనుగడ
  • ఈయేడు కోటి చింత మొక్కలకు ప్రణాళిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అంతరించిపోతున్న అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచడంతోపాటు  తెలంగాణను అత్యంత నివాసయోగ్యమైన, ఆరోగ్యకర రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన హరితహారం పల్లెల్లో దీక్షగా సాగుతున్నది. ఐదేండ్ల క్రితం ఈ మహత్తర కార్యక్రమానికి అంకురార్పణ జరుగగా.. ఈ నెల 20 నుంచి ఆరో విడుతలోకి అడుగిడనున్నది. దీనిలో భాగంగా గతేడాది నాటిన మొక్కల్లో 91 శాతం మొక్కలు మనుగడ సాధించగా.. పల్లెలు తమ ‘మొక్క’వోని సంకల్పాన్ని చాటిచెప్పాయి. గడిచిన ఐదేళ్లలో రికార్టు స్థాయిలో నాటిన 40.79 కోట్ల మొక్కలతో పచ్చదనం పరచుకున్న పల్లెలు ఈ ఏడాది మరో మైలు రాయిని అందుకునేందుకు సిద్ధమయ్యాయి. 

సగానికిపైగా గ్రామాల్లోనే

ఈ ఏడాది జూన్‌ 20న మొదలుకానున్న హరితహారం కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 24.66 కోట్ల మొక్కలు నాటాలనేది లక్ష్యం. కాగా ఇందులో అటవీశాఖ ఆధ్వర్యంలో 3.59 కోట్ల మొక్కలను నాటనుండగా 12.74 కోట్ల మొక్కలను గ్రామాల్లోనే నాటనున్నారు. అదే జరిగితే తెలంగాణ వచ్చాక పల్లెల్లో నాటిన మొక్కల సంఖ్య 50 కోట్లను దాటనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 182.75 కోట్ల మొక్కలు నాటితే అందులో అటవీ పునరుద్ధరణకు 30.97 కోట్లు నాటగా, గ్రామాల్లో 40 కోట్లకు పైగా నాటారు. మొక్కల పెంపకంలోనూ పంచాయతీలే ముందున్నాయి. రాష్ట్రంలోని 12,738 గ్రామాల నర్సరీల్లో ఈ ఏడాది హరితహారం కోసం 20.89 కోట్ల మొక్కలను పెంచారు. ఇవి కాకుండా అటవీ శాఖ ఆధ్వర్యంలో 2.16 కోట్లు,  ప్రత్యామ్నాయ అటవీకరణకు ‘కంపా’లో భాగంగా మరో 1.42కోట్ల మొక్కలను సిద్ధం చేశారు.  

ఈసారి కోటి చింత మొక్కలు

ఆరో విడతలో  వేప, రావి చెట్లతోపాటు కోటి చింత మొక్కలను నాటనున్నారు. ఇందుకోసం అటవీశాఖ ఆధ్వర్యంలో 24.50 లక్షలు, పంచాయతీ నర్సరీల్లో 81.69 లక్షల చింత మొక్కలను సిద్ధం చేశారు. వీటిలో 90 శాతం వరకు గ్రామాల్లోనే నాటనున్నారు. ఇంటింటికీ పంపిణీ చేసే ఆరు మొక్కల్లో చింత, వేప చెట్లకు తొలి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. ఇవే కాకుండా కోతుల బెడదను నివారించేందుకు ప్రత్యేకంగా గుర్తించిన 37 రకాల జాతుల మొక్కలను అటవీ ప్రాంతాల్లో నాటేందుకు ప్రణాళికలు రూపొందించారు. గ్రామాల్లో నాటే మొక్కల్లో తప్పనిసరిగా 85 శాతం మనుగడ సాధించాలని.. లేని పక్షంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో హరితహారంలో ఈ సారి గ్రామాలు కీలక భూమిక పోషించేందుకు సిద్ధమయ్యాయి. 

అటవేతర ప్రాంతాల్లో..ఐదేండ్లలో నాటిన మొక్కల వివరాలు

సంవత్సరం
నాటిన మొక్కలు(కోట్లలో)
2015-16
15.86
2015-17
31.67
2017-18
34.07
2018-19
32
2019-20
38.18
మొత్తం 
151.78


20 నుంచి ఆరోవిడుత హరితహారం

  • 24.66 కోట్ల మొక్కలు సిద్ధం 
  • నేడు రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం

ఆరోవిడుత హరితహారానికి అటవీశాఖ, పంచాయతీరాజ్‌, పురపాలకశాఖల ఆధ్వర్యంలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే హరితహారంలో నాటేందుకు 24.6 6 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలమేరకు ఇందులో 1.06 కోట్ల చింతమొక్కలను నాటనున్నారు. హరితహారానికి అధికారయంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేయడానికి గురువారం ఉద యం 10.30 గంటలకు బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధ్యక్షతన రాష్ట్రస్టాయి కమిటీ సమావేశమవుతున్నది. ఈ మేరకు పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభ అటవీశాఖ నుంచి రాష్ట్రస్థాయి కమిటీలోఉన్న 14 మంది అధికారులకు సమాచారమందించారు. అటవీశాఖ 3.50 కోట్లు మొక్కలను సిద్ధం చేయగా.. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల ఆధ్వర్యంలో అన్ని పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో ఏర్పాటుచేసిన నర్సరీల్లో 21.16 కోట్ల మొక్కలను ఆందుబాటులో ఉంచారు. 


logo