గురువారం 09 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 01:56:55

పుడమి తల్లికి పచ్చలపేరు

పుడమి తల్లికి పచ్చలపేరు

  • ఆరో విడుత హరితహారానికి నేడు శ్రీకారం
  • నర్సాపూర్‌లో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌ 
  • రాష్ట్రవ్యాప్తంగా నాటుకోనున్న30 కోట్ల మొక్కలు 
  • నర్సరీల నుంచి ఆయా ప్రాంతాలకు తరలింపు
  • ఏర్పాట్లను పరిశీలించిన ఇంద్రకరణ్‌, హరీశ్‌రావు
  • నర్సాపూర్‌ అర్బన్‌పార్క్‌ విశిష్టతలు ఇవి:4,380 ఎకరాల్లో అడవి
  • 630 ఎకరాల్లో ఫారెస్ట్‌ పార్క్‌ సృష్టి 
  • రూ.8 కోట్లతో అభివృద్ధి
  • 256 పక్షిజాతులకు నెలవు

ఓ ఊళ్లో ఓ పండు ముదుసలి.. ఉదయాన్నే ఇంటిముందు మామిడి మొక్క నాటాడు. కుండతో నీళ్లు తెచ్చి ఆ మొక్కకు పోస్తున్నాడు. దారి వెంట వెళ్తున్న ఓ బాటసారి ఇదంతా చూశాడు. తాతా.. నీ వయసు అయిపోతున్నది. ఈ మొక్క ఎప్పుడు పెరిగి వృక్షమవుతుంది? ఎప్పుడు కాయలు కాస్తుంది? అవన్నీ నువ్వు తినాలనే? ఎంత ఆశ! అన్నాడు. తాత బోసి నవ్వు నవ్వి.. ‘ఇది నాకోసం కాదు..  ముందు తరాల వారికోసం’ అన్నాడు. భావితరాల కోసం ఆలోచించేవాడే దార్శనికుడు. ఆ దార్శనికతతోనే తెలంగాణ ప్రభుత్వం, ముందు తరాల బాగుకోసం హరితహారాన్ని చేపట్టింది. 6వ విడుత హరితహారం నేడే ప్రారంభం.

పచ్చని చెట్టంటే వేరేమిటో కాదు; సమస్యల బండరాళ్లను సైతం తొలుచుకుని పరిష్కారంగా పైకి తన్నుకు వచ్చి బతికేదే!!

తెలంగాణలో నీళ్లు లేవనీ, నీళ్లొచ్చే తెరువు లేదని సాకులు చెప్పి... నీళ్లు లేనందుకే తెలంగాణ  నీరుగారి, ఎడారిలా మారిపోతున్నదని నింద మోపి... బీడు భూములు, పడావుబడ్డ పొలాలు, కురవని మేఘాలు, కరిచే కోతులతో బలిపీఠంగా మార్చిన ఉమ్మడి పాలనకు నికార్సైన జవాబుగా చేపట్టిన హరితహారంలో నేడు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఆరో విడుత కార్యక్రమం మొదలుకానుంది. చిన్నా పెద్దా, బీదాబిక్కీ, పిల్లా జెల్లా, నేతా తాత అందరూ జాతరలా కదిలి, మొక్కలు నాటే పండుగతో వానకాలానికి స్వాగతం పలుకబోతున్నారు. అడివిని అంతం చేయడమే తప్ప పంతంగా బతికించేవారు కనిపించని కాలంలో తెలంగాణ ప్రభుత్వం, రాష్ర్టానికి ప్రతిఏటా పచ్చలపేరును తొడుగుతున్నది. ప్రతి ఊర్లో ఒక నర్సరీ, ప్రతి చేతా ఒక మొక్క! నాటిన మొక్కలు ఎండకుండా ఊరూరా ట్యాంకర్లు. వానలు వాపస్‌ వచ్చి కోతులు వాపస్‌ పోయేలా పల్లెపల్లెనా చిట్టి అడవులు. పట్టణానికో గ్రీన్‌ ప్లాన్‌. బడ్జెట్‌లో పది శాతం పచ్చదనానికే. దేశంలో మరే రాష్ట్రమూ చేయని పని ఇది. సంకల్పం మొక్క వంటిది. సాకారం కావడమే వృక్షం. అందుకు హరితహారమే నిదర్శనం.


హైదరాబాద్‌/ సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ మెడలో పచ్చల పేరు వేయడంకోసం ప్రారంభించిన హరితహారంలో ఆరోవిడుత కార్యక్రమం గురువారం ప్రారంభం కాబోతున్నది.  భావితరాలకు స్వచ్ఛమైన, అకలుషితమైన, ఆకుపచ్చని తెలంగాణ అందించాలన్న లక్ష్యం సిద్ధించేదిశగా ఈ దఫా 30 కోట్ల మొక్కలు  నాటేందుకు ప్రభుత్వం సంకల్పించింది. సుజల సజల సస్యశ్యామల తెలంగాణ కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్యమకాలంలోనే పిలుపునిచ్చారు. స్వరాష్ట్రం సాధించుకొన్న తర్వాత ఆ సంకల్ప సాధనకు రాష్ట్ర ప్రభుత్వం అసాధారణంగా కృషిచేస్తున్నది.  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. 

అటవీ పునరుద్ధరణ పథకం కింద అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో ఉదయం 11.30 గంటలకు మొక్కను నాటనున్నారు. సీఎంతోపాటు మరో ఎనిమిది మంది ప్రముఖులు మొక్కలు నాటుతారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ప్రజాప్రతినిధులను, అధికారులను ఈ కార్యక్రమానికి అనుమతిస్తున్నారు. ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో మొత్తం 30 కోట్ల మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 34 శాఖల సమన్వయంతో రాష్ట్ర అటవీశాఖ ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బుధవారం మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి నర్సాపూర్‌లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రుల వెంట ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, పీసీసీఎఫ్‌ స్వర్గం శ్రీనివాస్‌, కలెక్టర్‌  ధర్మారెడ్డి, ఎస్పీ, డీఎఫ్‌వోలు ఉన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా మొక్కల తరలింపు

హరితహార కార్యక్రమం మొదలుకానున్న నేపథ్యంలో గ్రామాల్లోని నర్సరీల నుంచి బుధవారం సాయంత్రమే మొక్కలను నాటే స్థలాలకు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 

దేశానికే ఆదర్శం

హరితహారం కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ప్రాధాన్యమిచ్చి.. పచ్చదనం పెంచడం కోసం అహరహం శ్రమిస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ మాత్రమే. దశాబ్దాలుగా నినాదానికే పరిమితమైన ‘పచ్చదనం పరిశుభ్రత’ ఇప్పుడు వాస్తవరూపం దాలుస్తున్నది. అడవులను నరకడం.. నాశనం చేయడమే తప్ప పెంచాలి.. అభివృద్ధిచేయాలన్న స్పృహ గతంలో ఏ ఒక్క ప్రభుత్వానికీ లేదు. వానకాలం వస్తే ఉత్తుత్తిగా మొక్కలు నాటడం.. తర్వాత వానకాలానికి గతంలో నాటినచోటే మరో మొక్క నాటడం తప్ప.. నియతితో ఒక్క మొక్కను పెట్టింది లేదు.. పెంచింది లేదు. తెలంగాణ వచ్చిన తరువాతే మొక్కల పెంపకంపై స్పృహ పెరిగింది. 24 శాతంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెంచడం కోసం ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఎవరు ఏమనుకున్నా.. విమర్శించినా పట్టించుకోకుండా ముందుకుపోతున్నది. ప్రతి ఊరిలోనూ నర్సరీ పెంచడం, జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి ప్రతి 30 కిలోమీటర్లకో నర్సరీని ఏర్పాటుచేయడంఅన్నది దేశంలోనే ఎక్కడా లేదు. అడవుల పునరుద్ధరణ అన్నది అత్యవసరమన్న జిజ్ఞాసను ప్రజలందరిలో కలిగించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. 

ప్రతి ఊరిలో, మున్సిపాలిల్లో, కార్పొరేషన్లలో ఒక లక్ష్యం నిర్దేశించి.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా ప్రేరణ కల్పించింది. మొక్కలు నాటడమే కాకుండా వాటిని బతికించడానికి ట్యాంకర్లను కూడా ఇచ్చింది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పది శాతం గ్రీన్‌ బడ్జెట్‌ను పెట్టాలని మాటలకే పరిమితం కాకుండా ఏకంగా చట్టంచేసి నిర్బంధంగా నిధులు విడుదల చేసేలా చూసింది. ఈ చట్టం అమలును తప్పనిసరిచేస్తూ, దీని బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. దీంతోపాటు ప్రతి ఊరికీ గ్రీన్‌ప్లాన్‌ తయారుచేయాలని ఆదేశించింది. 230 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో దేశంలోనే కనీవినీ ఎరుగని హరితవిప్లవాన్ని తెలంగాణ తీసుకొచ్చింది.  అటవీప్రాంతం లేని పట్టణ ప్రాం తాల్లో అర్బన్‌ పార్కుల అభివృద్ధికి నాంది పలికింది. యావత్‌ తెలంగాణ పచ్చగా ఉండాలన్న  ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నది.

256 పక్షి జాతులకు నిలయం


నర్సాపూర్‌ అర్బన్‌పార్క్‌లో అనేక విశిష్టతలున్నాయి. ఇది ఐదు అటవీ కంపార్ట్‌మెంట్‌లలో 4,380 ఎకరాల అటవీ ప్రాంతం. 630 ఎకరాల్లో ఫారెస్ట్‌ పార్క్‌ ఉన్నది. ఇందుకోసం రూ.8 కోట్ల వ్యయంచేశారు. 15 కిలోమీటర్ల మేర రక్షణ ప్రహరీ (సీ త్రూ వాల్‌, చైన్‌ లింక్‌ ఫెన్సింగ్‌)తో నిర్మాణం జరిగింది. సహజసిద్ధమైన అడవులు, ఎత్తైన కొండలు, పక్షుల కిలకిలరావాలు.. ఎత్తైన వాచ్‌టవర్‌, ప్రత్యేక ముఖద్వారాలతో నర్సాపూర్‌ అర్బన్‌ పార్క్‌ ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తుంటుంది. ఈ అటవీ ప్రాంతం 256 పక్షి జాతులకు నిలయంగా ఉన్నది. తెలంగాణలో 434 పక్షి జాతులుండగా.. అందులో 60 శాతం నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలోనే ఉండటం విశేషం. ఇక్కడ ఉండే 256 పక్షి జాతుల్లో 173 స్థానికమైనవి. మిగతా 83 రకాలు వలస పక్షులు. ఇవి వేసవి, శీతాకాలంలోనే ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటాయి.


logo