శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 01:52:03

ఏటా కోటి ఉద్యోగాలేవీ? ఖాతాల్లో 15 లక్షలు ఎక్కడ?

ఏటా కోటి ఉద్యోగాలేవీ? ఖాతాల్లో 15 లక్షలు ఎక్కడ?

  • అబద్ధాలే పునాదిగా 
  • బీజేపీ నాయకుల ప్రచారం  
  • తెలంగాణలో 1,24,990 ఉద్యోగాలు భర్తీ చేసినం
  • బీజేపీ, కాంగ్రెస్‌ల అసత్య ప్రచారాన్ని యువత తిప్పికొట్టాలి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు   
  • తొగుట యువజన సభ గ్రాండ్‌ సక్సెస్‌

సిద్దిపేట, నమస్తేతెలంగాణ: ‘అబద్ధాలే పునాదిగా బీజేపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారు.. సోషల్‌ మీడియాలో అవాస్తవాలతో ప్రచారానికి దిగుతున్నారు.. కేంద్రం లో అధికారంలోకి వచ్చాక ఇస్తామన్న ఏడాదికి కోటి ఉద్యోగాలేవీ?.. ప్రజల ఖాతాల్లో వేస్తామన్న రూ.15 లక్షలు ఎక్కడ?’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల గోబెల్స్‌ ప్రచారాలను తిప్పికొట్టాలని యువత, విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుటలో యువత నిర్వహించిన బైక్‌ ర్యాలీ, యువజన సభలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్‌, పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత రామలింగారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భం గా హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీజేపీ నాయకులకు నిజాయితీ ఉంటే తాము చేసిన పనులేంటో ప్రజలకు చెప్పాలన్నా రు. బాయిలకాడ కరెంటు మోటర్లకు మీటర్లు తేవడమా?.. పెద్దనోట్లు రద్దు చేస్తామని చెప్పి వెయ్యినోట్ల స్థానం లో రెండు వేల నోట్లు తేవడమా?.. తెలంగాణ రైతుల నోట్లో మట్టిగొట్టేలా విదేశీ మక్కల కొనుగోలు చేయడమా? అన్నది బీజేపీ నాయకులు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘వ్యవసాయ మార్కెట్‌ వ్యవస్థలోకి టాటాలు, అంబానీలు వస్తే మన రైతులకు ధర వస్తదా?.. భరోసా ఉంటదా?.. అలాంటి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి’ అని హరీశ్‌రావు అడిగారు. 

1,24,990 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం.. 

ఇచ్చిన మాట ప్రకారం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో 1,24,990 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని హరీశ్‌రావు స్పష్టంచేశారు.  అందులో టీఎస్‌పీఎస్సీ ద్వారా 28,943, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో 31,972, గురుకులాల్లో 3,623, పంచాయతీరాజ్‌లో 10 వేలు, మిగతావి ఇతర విభాగాల్లో భర్తీ చేసిందన్నారు. కొన్ని ఇంటర్వ్యూ స్థాయిలో ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తెచ్చిన పాలసీలతో ప్రైవేటు రంగంలోనూ 8 వేల పరిశ్రమలు రాష్ర్టానికి వచ్చాయనీ, 15 లక్షల మందికి ఉద్యోగాలు దొరికాయని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారనీ, ఎవరికైనా వచ్చాయా? అని సభలో ఉన్న వారిని మంత్రి ప్రశ్నించారు. యేటా కోటి ఉద్యోగాలు ఇస్తామన్నమోదీ సర్కార్‌.. డీమానిటైజేషన్‌ చేయడంతో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. 

మోసం చేయడమే బీజేపీ నాయకుల నైజం..

నిజామాబాద్‌లో గెలిస్తే పసుపు బోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌ మీద రాసిచ్చి గెలిచిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌.. ఇంతవరకు తెచ్చిండా?..  దుబ్బాకలోనూ అలాగే మోసం చేస్తారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీహార్‌లో మోదీ చెప్పిన డబుల్‌ ఇంజిన్‌ లాగా.. దుబ్బాకలో కారు గెలుస్తే హైదరాబాద్‌లో ఉన్న కారింజన్‌తో దుబ్బాక అభివృద్ధి డబుల్‌ స్పీడ్‌తో ముందుకెళ్తుందన్నారు. కాంగ్రెస్‌కు చెరుకు ముత్యంరెడ్డిపై ప్రేమ ఉంటే గత ఎన్నికల్లో టికెట్‌ ఎందుకు ఇవ్వలేదో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన తండ్రి ఆత్మ క్షోభించేలా కాంగ్రెస్‌లో చేరిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ప్రజలకు ఏం సేవ చేస్తారని మంత్రి ప్రశ్నించారు. 2001లో కేసీఆర్‌ తెలంగాణ జెండా ఎత్తిననాడు.. ఈ కాంగ్రెస్‌ నాయకులు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అడుగులకు మడుగులొత్తారని విమర్శించారు. ఒక ఓటు, రెండు రాష్ర్టాలు అని కాకినాడ తీర్మానం చేసి.. అధికారంలోకి వచ్చాక మోసం చేసింది బీజేపీ పార్టేనని అన్నారు. డిసెంబర్‌ 9న వచ్చిన తెలంగాణ వాపస్‌పోతే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారనీ, బీజేపీ వాళ్లు రాజీనామా ఎందుకు చేయలేదని మంత్రి ప్రశ్నించారు.  

టీఆర్‌ఎస్‌ వైపే ముంపు గ్రామాలు 

‘మల్లన్న సాగర్‌ ముంపు గ్రామాల ప్రజలు కేసీఆర్‌ మీద, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి ఇక్కడికి వచ్చారనీ, తప్పకుండా మీ నమ్మకాన్ని కాపాడుతామని, మీకు రావాల్సి న ప్రతి పైసా ఇప్పిస్తాం. మీ ఉత్సాహం చూస్తుంటే సుజాతక్క గెలుపు ఖాయంగా కనిపిస్తుందని’ మంత్రి అన్నారు.  

తొగుట యువజన సభ సక్సెస్‌

తొగుటలో యువత బైక్‌ ర్యాలీ, సభ గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యిం ది. మండలంలోని అన్ని గ్రామాల నుంచి యువత పెద్దఎత్తు న పాల్గొని ‘జై తెలంగాణ.. జై కేసీఆర్‌' అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ కాన్గల్‌ నుంచి ర్యాలీగా వచ్చారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ర్యాలీలో పాల్గొని యువతలో ఉత్తేజాన్ని నింపారు. ‘బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు చూడండి.. ఇదిగో మా యువత’ అంటూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేశాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత మాట్లాడుతూ.. మీరంతా నాబిడ్డలు, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటానన్నారు.

సిద్దిపేటలో బీజేపీ డ్రామాలు..

బీజేపీ నాయకులు సిద్దిపేటలో ఎన్ని డ్రామాలు ఆడుతున్నారో ప్రత్యక్షంగా చూశారు కదా అని మంత్రి హరీశ్‌రావు యువతతో అన్నారు. దొరికిన డబ్బులతో సంబంధం లేకపోతే.. అరగంటలో అక్కడికి ఎందుకు వెళ్లావని బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును హరీశ్‌రావు ప్రశ్నించారు. దుబ్బాకలో పంచడానికే డబ్బులు తెచ్చామని సదరు యజమాని ఒప్పుకున్న వీడియో ప్రజలంతా చూశారన్నారు. ‘మీరు ఇచ్చే పింఛన్‌ పైసల గురించి మాట్లాడుదామని దుబ్బాక బస్టాండ్‌కు రమ్మంటే ఎవరైనా వచ్చారా?.. మీరు ఇచ్చేదే నిజమైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. లేకపోతే నీ ముక్కు నేలకు రాస్తావా? అని సవాల్‌ విసిరితే బీజేపీ నాయకులు తోక ముడిచారు’ అని ఎద్దేవా చేశారు. దానినుంచి బయటపడటానికే బీజేపీ నాయకులు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.  

టీఆర్‌ఎస్‌కే ఓటేస్తాం..

ఉప ఎన్నికలో మా ఓటు టీఆర్‌ఎస్‌కే. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం రైతులను అన్నివిధాలా ఆదుకుంటున్నది. ఏండ్లుగా కాంగ్రెస్‌, బీజేపీ  ప్రభుత్వాల కారణంగా మేముపడ్డ ఆర్థిక ఇబ్బందులు టీఆర్‌ఎస్‌ వచ్చినంకనే తొలగినయి.

- శివలింగు రామచంద్రం, పల్లెపహాడ్‌, తొగుట మండలం 

బీజేపీ, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరు

ఎన్నికలు రాగానే గ్రామాల్లోకి వచ్చే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను ప్రజలు నమ్మట్లేదు. పేదల కోసం పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతక్కకు ఓటు వేస్తాం. 

-  కాస సత్యనారాయణ, వడ్డేపల్లి, తొగుట మండలం