గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 16:00:01

ఆక్సిజ‌న్‌ను కొనే దుస్థితి మ‌న‌కు రావొద్దు : హ‌రీష్‌రావు

ఆక్సిజ‌న్‌ను కొనే దుస్థితి మ‌న‌కు రావొద్దు : హ‌రీష్‌రావు

సిద్దిపేట : మొక్క‌ల‌ను పెంచి ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుదామ‌ని మంత్రి హ‌రీష్‌రావు పిలుపునిచ్చారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌డం వ‌ల్ల స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇప్ప‌టికే ఢిల్లీ లాంటి ఏరియాల్లో ఆక్సిజ‌న్‌ను కొనే ప‌రిస్థితి వ‌చ్చింది. ఒక్కో మ‌నిషి 3 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను కొంటున్నాడు. ఒక్కో సిలిండ‌ర్ ఖ‌ర్చు రూ. 700, ఈ లెక్క‌న మూడు సిలిండ‌ర్ల‌కు రూ. 2,100 ఖ‌ర్చు అవుతుంది. మొత్తంగా ఒక మనిషి జీవిత కాలంలో పీల్చే ఆక్సిజన్ కొనుగోలు చేస్తే.. రూ. 5 కోట్లు ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తుంద‌న్నారు. కాబ‌ట్టి మ‌న‌కు ఆక్సిజ‌న్‌ను కొనే దుస్థితి మ‌న‌కు రావొద్దు అని హ‌రీష్‌రావు అన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటి పెంచితే.. ఈ స‌మ‌స్యే ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. 

సిద్ధిపేట జిల్లా అడవుల్లో పచ్చదనం పెంచేందుకు వినూత్న ప్రయత్నం చేప‌ట్టారు. అడవిలో డ్రోన్ ద్వారా విత్తన బంతులు చల్లే కార్యాక్రమన్నిమంత్రి హ‌రీష్‌రావు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్యఅతిథులుగా ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత వ‌న‌జీవి రామ‌య్య‌, ఆయ‌న స‌తీమ‌ణి పాల్గొన్నారు. 


ఈ సంద‌ర్భంగా హ‌రీష్‌రావు మాట్లాడుతూ.. ప్ర‌కృతికి సేవ చేస్తే మ‌నిషికి సేవ చేసిన‌ట్టే అని పేర్కొన్నారు. చెట్లు ఉచితంగా ఆక్సిజ‌న్ ను ఇస్తున్నాయి. వనజీవి రామయ్య జీవితం అందరికి ఆదర్శనీయ‌మ‌న్నారు. వారు కోటికి పైగా మొక్కలు నాటి ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు పాటు ప‌డుతున్నార‌ని ప్ర‌శంసించారు. 

అడ‌వుల్లో మొక్క‌లను నాటేందుకు డ్రోన్ల‌ను వినియోగిస్తున్నామ‌ని తెలిపారు. సీడ్ బాల్స్ లో కోతులకు ఆహారం ఇచ్చే చెట్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చామ‌న్నారు. తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం పెంపు కోసం అధిక ప్రాధామ్యం ఇస్తోంది. గత ప్రభుత్వాలు అడవుల్లో చెట్లు నరికితే.. టీఆర్ఎస్ ప్రభుత్వం అడవుల్లో మొక్కలు నాటి పెంచుతుంద‌ని మంత్రి హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. 

చెట్టు క‌న్న‌త‌ల్లి లాంటిది : వ‌న‌జీవి రామ‌య్య‌

చెట్టు క‌న్న‌త‌ల్లి లాంటిద‌ని.. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌ని వ‌న‌జీవి రామ‌య్య స్ప‌ష్టం చేశారు. అడవుల్లో పచ్చదనం పెంచడానికి సీడ్ బాల్స్ మంచి ప్రయత్నం అని అన్నారు. సహజంగా మొలకెత్తిన మొక్క బలంగా పెరుగుతుంది అని పేర్కొన్నారు. లాటరీ టికెట్ కొంటె లాభం వస్తదో రాదో తెలియదు.. కానీ మొక్క నాటితే పండ్లు, నీడ, గాలి ద్వారా లాభం వస్తుంద‌న్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ర్యావ‌ర‌ణ విధ్వంసం జ‌రుగుతోంది. ప్రతి రోజు 50వేల హెక్టర్ల విస్తీర్ణంలో అడవి అంతరించిపోతుంది. శాశ్వత ప్రాతిపదికన మనం బతకాలంటే.. మొక్కలు నాటి వృక్షాలుగా చేయాలి అని వ‌న‌జీవి రామ‌య్య కోరారు.logo